‘నామా’కు బహుమానం! | TDP Government Illegally Allocate Polavaram Funds To Nama Company | Sakshi
Sakshi News home page

‘నామా’కు బహుమానం!

Mar 1 2019 6:55 AM | Updated on Mar 1 2019 12:26 PM

TDP Government Illegally Allocate Polavaram Funds To Nama Company - Sakshi

సాక్షి, అమరావతి: ఒప్పందం ప్రకారం పనులు చేయని కాంట్రాక్టర్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని జరిమానా వసూలు చేయాలి. కానీ పోలవరం ఎడమ కాలువ ఆరో ప్యాకేజీలో పనులు చేయకుండా మొండికేసిన టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరావుకు టీడీపీ సర్కార్‌ జరిమానాకు బదులుగా భారీ నజరానా ఇచ్చింది. నామా సంస్థ నుంచి రూ.70.29 కోట్ల విలువైన పనులను 60 సీ నిబంధన కింద తొలగించిన సర్కారు వాటి వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేయడం గమనార్హం. ఈ పనులను టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించే ఫైలుపై సీఎం చంద్రబాబు గురువారం సంతకం చేశారు. ఆర్థిక, జలవనరుల శాఖల అభ్యంతరాలను తుంగలో తొక్కి దొడ్డిదారిన పనులను అప్పగించడం వెనుక రూ.50 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంతో పోలవరం ఎడమ కాలువలో ఎనిమిది ప్యాకేజీల పనులనూ నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించినట్లైంది.  

ధరల సర్దుబాటు కింద అదనంగా చెల్లింపులు.. 
పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న వెంటనే ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నవంబర్‌ 11 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఆలోగా.. ఆరో ప్యాకేజీ మినహా మిగిలిన ఏడు ప్యాకేజీల పనులు చేస్తున్న పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసిన ప్రభుత్వ పెద్దలు వాటిని కమీషన్‌లు ఇచ్చిన కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతిలోఅప్పగించేశారు. ఆరో ప్యాకేజీ (ఎడమ కాలువ 111 కి.మీ. నుంచి 136.780 కి.మీ. వరకు) పనులను  రూ.196.20 కోట్లకు 2005లో దక్కించుకున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌–సినో హైడ్రో సంస్థ ఇప్పటివరకూ రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనంగా సర్కార్‌ చెల్లించింది. నామా సంస్థ కావడంతో పనులు చేయకున్నా వేటు వేయలేదు. నిబంధనల ప్రకారమైతే ఈ సంస్థపై 61సీ నిబంధన కింద వేటు వేసి.. పనుల్లో జాప్యం వల్ల పెరిగిన అంచనా వ్యయంలో 95 శాతాన్ని ఆ సంస్థ నుంచి జరిమానాగా సర్కార్‌ వసూలు చేయాలి. కానీ నామా నాగేశ్వరరావు సంస్థపై 61 సీ నిబంధన కింద సర్కార్‌ చర్యలు తీసుకోలేదు. 

టీడీపీ నేతకు నామినేషన్‌పై అప్పగింత..: 
ఆరో ప్యాకేజీ పనులు చేయకుండా చేతులెత్తేసిన నామా నాగేశ్వరరావు సంస్థపై వేటు వేయకుండా రూ.70.29 కోట్ల విలువైన పనులను 60 సీ నిబంధన కింద తొలగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో రూ.13.43 కోట్ల విలువైన పనులు మాత్రమే నామాకు మిగిలాయి. అనంతరం 60 సీ కింద తొలగించిన పనుల అంచనా వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. నిబంధనల ప్రకారం 60 సీ కింద కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నా ఐదు శాతం అంటే రూ.7.50 కోట్లను నామా సంస్థ నుంచి జరిమానాగా వసూలు చేయాలి. కానీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో అధికారులు జరిమానా వసూలు చేయలేదు. నామా నుంచి తొలగించి పనులను పెంచిన అంచనా వ్యయంతో తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించాలని సీఎం చంద్రబాబు జలవనరుల, ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రూ.పది లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం కలిగిన పనులను టెండర్ల ద్వారానే అప్పగించాలని స్పష్టం చేసిన అధికారులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. దీంతో రూ.153.46 కోట్ల విలువైన పనులను బీఎస్సార్‌కు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించే ఫైలుపై సీఎం చంద్రబాబే గురువారం సంతకం చేశారు. ఆ వెంటనే అంటే ఆదివారం రోజు బీఎస్సార్‌ సంస్థ ఆరో ప్యాకేజీలో తమకు  కేటాయించిన పనులను అధీనంలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో రూ.50 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

నామాకు భారీ ప్రయోజనం.. 
ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.196.20 కోట్లు. ఇందులో నామా సంస్థ రూ.112.48 కోట్ల విలువైన పనులు మాత్రమే చేసింది. దీంతో 60 సీ కింద రూ.70.29 కోట్ల విలువైన పనులు తొలగించారు. అంటే నామా చేతిలో రూ.13.43 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువను ఏకంగా రూ.399.18 కోట్లకు పెంచేయించారు. ఇందులో 60 సీ కింద తొలగించిన రూ.70.29 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే నామా చేతిలో మిగిలిన రూ.13.43 కోట్ల పనుల విలువను రూ.119.81 కోట్లకు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. పెరిగిన అంచనా వ్యయంలో 95 శాతం (రూ.192.31 కోట్లు) జరిమానాగా వసూలు చేయాల్సిందిపోయి నామాకు రూ.106.38 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement