విశాఖ తీరం: మునిగిపోతున్న నావలా టీడీపీ

TDP Facing Big Political Crisis In Vishakapatnam District - Sakshi

తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏదైనా ఒక్క జిల్లా పాలిటిక్స్­ను పరిశీలిస్తే చాలు. సువిశాల తీరం ఉన్న విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మునిగిపోయే నావలా తయారైంది. ప్రజాప్రతినిధులు ఎవరి దారిలో వారు నడుస్తూ.. పార్టీని దారిలో పెట్టేవారే లేనట్టు కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. 

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేల చూపులు చూస్తోంది. తీరంలో సైకిల్ తిరోగమనంలో పయనిస్తోంది. 2004 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో కేవలం నలుగురితో సరిపెట్టుకుంది. అందులో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు గెలుపు అంత ఈజగా రాలేదు. చివరి నిమిషంలో చావుతప్పి కన్నులొట్టబోయినట్టు ఆయన ఒడ్డునపడ్డారు. ఇక, పార్టీలో గెలిచిన నలుగురైనా.. చెయ్యీ చెయ్యీ కలిపి ముందుకెళ్తున్నారా అంటే అదీ లేదు. నలుగురూ నాలుగు దారుల్లో వెళ్తూ.. పార్టీని ఏ తీరానికి తేర్చాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి పూర్తిస్థాయిలో తేరుకోలేకపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికీ లోకల్ సమస్యలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడికక్కడ లోకల్ అధికార కేంద్రాలుగా మారేందుకు.. విశాఖ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. 

విశాఖ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా ఎస్ఏ రెహ్మాన్‌ను నియమించారు. అయితే.. రెహ్మాన్‌కు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంది. రెహ్మాన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తాను పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టనని భీష్మించుకొని కూర్చున్నారు వాసుపల్లి గణేష్. అంతేకాదు, రెహ్మాన్‌ను బాహాటంగానే ఆయన విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి గణేష్‌కు షోకాజ్ నోటీసులు ఇస్తానని రెహ్మాన్ ప్రకటించారు కూడా. ఇటు వాసుపల్లి ధోరణి మాత్రం ఏం చేసుకున్నా పర్వాలేదు.. టీడీపీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసేది లేదనేలా ఉంది. ఇటీవల అధికార పార్టీని విమర్శించడానికి వాసుపల్లి గణేష్ పార్టీ కార్యాలయంలో కాకుండా.. ఒక హోటల్లో ప్రెస్‌మీట్ పెట్టడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా.. సొంత ఖర్చుతో ప్రెస్‌మీట్ పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయం ఉండగా ప్రెస్‌మీట్ బయట ఎక్కడో పెట్టడం ఏంటని రెహ్మాన్ రగిలిపోతున్నారట. వాసుపల్లి గణేష్ అధికార పార్టీ కంటే తననే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. 

ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా మెలుగుతున్నారని తెలుస్తోంది. స్వయంగా అధ్యక్షుడు ఆదేశించినా.. ఆయన మాత్రం ఆచరించడానికి మొగ్గుచూపడం లేదని అంటున్నారు. ఇక.. కాకలు తీరిన గంటా శ్రీనివాసరావు గురించి చెప్పనవసరమే లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ఆయన పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదట. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు అనుభవించి అధికారం చెలాయించడాన్ని బాగా వంటబట్టించుకున్న గంటా... ఇప్పుడు ఆ అధికారానికి దూరంగా జస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని సొంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్న విశాఖ జిల్లా టీడీపీ నేతలు.. కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేస్తారు.. పార్టీని ఏ తీరానికి చేరుస్తారనేది నాయకులకే అర్థంకాని మిస్టరీగా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top