హోదాపై మాటల యుద్ధం | TDP And YSRCP members Word war on Special status for AP | Sakshi
Sakshi News home page

హోదాపై మాటల యుద్ధం

Jun 19 2019 5:00 AM | Updated on Jun 19 2019 5:00 AM

TDP And YSRCP members Word war on Special status for AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం విపక్ష సభ్యులు మాట్లాడిన తీరుపై అధికార పార్టీ సభ్యులు భగ్గుమన్నారు. సభలో కొంతసేపు తీవ్ర గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు ప్రత్యేక హోదా తెస్తామంటేనే ప్రజలు అధికారం ఇచ్చారు, హోదా తీసుకురావాలని సూచిస్తున్నాం అని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పందిస్తూ.. మాకు మీరు సూచన చేయడమేంటి, ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నది మీరు కాదా? అని ధ్వజమెత్తారు. మీకు కేంద్రం ఏం ప్యాకేజీ ఇచ్చిందో మాకు తెలియదు కానీ దీన్నుంచి బయట పడాలని అనుకుంటున్నారు అని విమర్శించారు. ఇంతలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలుగజేసుకుని గిల్లి గిల్లిచ్చుకోవాలని చూసేది మీరేనని, హోదా విషయంలో, ప్యాకేజీ విషయంలోనూ మమ్మల్ని కేంద్రం తప్పుదారి పట్టించిందని, దీనికి దెప్పిపొడవాల్సిన అవసరం లేదని అన్నారు. సభలో హోదా తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

కోటంరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుల వాగ్వాదం
హోదాపై తీర్మానం సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సభను వేడెక్కించాయి. వంచన, వెన్నుపోటు, అవినీతి, దగా వంటివాటిపై పట్టాలిచ్చే విశ్వవిద్యాలయం ఉంటే ఇది చంద్రబాబుకే ఇవ్వాలని శ్రీధర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతూ శ్రీధర్‌రెడ్డి మాట్లాడారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు కొంతసేపు వాగ్వాదానికి దిగారు. స్పీకర్‌ కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ఆ రోజు మేము హోదాపై మాట్లాడితే ట్యూషన్‌ పెట్టించుకోండని చంద్రబాబు అన్నది నిజం కాదా? ప్యాకేజీ వచ్చిందని ఢిల్లీలో కేంద్ర మంత్రులకు సన్మానాలు చేసి శాలువాలు కప్పారు, ఆ శాలువాలు రూములను నింపినా సరిపోవని ఎద్దేవా చేశారు. ఇంతలోనే అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటూ.. తాము ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోలేదని, హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటేనే అంగీకరించామని పేర్కొన్నారు. 

దీక్ష చేస్తానంటే బాబు వద్దన్నారు: మంత్రి అవంతి  
హోదా కోసం తాను విశాఖలో దీక్షకు పూనుకుంటే అప్పటి సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అసెంబ్లీలో ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఐదుసార్లు ఫోన్లు చేయించి ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఆ తర్వాత అప్పటి కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఫోన్‌ చేసి.. పార్టీలో నువ్వొక్కడివే ఎంపీవా, నీకు ఒక్కడికే హోదా కావాలా అంటూ కోపగించి దీక్ష విరమించేలా చేశారని పేర్కొన్నారు. హోదా కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో మైలేజీ ఆయనకు వెళ్తోందన్న భయంతో చంద్రబాబు కూడా మళ్లీ హోదా డిమాండ్‌ను ఎత్తుకున్నారన్నారు. చంద్రబాబు వైపు మంత్రి అవంతి చూపిస్తూ... ‘‘సార్‌ మీరు నన్నేమీ అనుకోవద్దు. మీ పక్కన ఉన్నవాళ్లు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, వాళ్లను నమ్మొద్దు’’ అనడంతో సభ్యులంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు.  

చంద్రబాబూ క్షమాపణ చెప్పండి : అంబటి 
గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్ల ప్రత్యేక హోదా రాకుండా పోయింది. నేను తప్పు చేశాను, నావల్ల ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరిగిందని చంద్రబాబు ఒప్పుకుని, రాష్ట్ర ప్రజలను క్షమాపణలు అడిగితే బాగుంటుంది’’ అని వైఎస్సార్‌సీపీ సభ్యుడు అంబటి రాంబాబు సూచించారు. క్షమాపణలు చెబితే బాబు క్రేజ్‌ ఇంకా పెరుగుతుందన్నారు. గతాన్ని తవ్వి చంద్రబాబును విమర్శించే అవకాశం టీడీపీ సభ్యులే ఇస్తున్నారని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement