
సాక్షి, హైదరాబాద్: ర్యాలీకి అనుమతివ్వలేదనే అక్కసుతో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై లేనిపోని అభాండాలు మోపడం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఎంపీగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరైంది కాదని, శాంతిభద్రతల పరిరక్షణలో కమిషనర్ సేవలు ఎనలేనివని, హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అధికారిని తూలనాడడం దురదృష్టకరమన్నారు. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు అనుమతిచి్చంది కూడా ఈ అధికారే అనే విషయాన్ని ఉత్తమ్ మరచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.
పోలీసుశాఖపై లేనిపోని ఆరోపణలు చేయడం ఉత్తమ్ లాంటి నాయకులకు తగదని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టు కుని మాట్లాడితే మంచిదని తలసాని హెచ్చరించారు. అనుమతిస్తే మంచి అధికారి, అనుమతించకుంటే అవినీతి అధికారి అంటూ గగ్గోలు పెట్టడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్.. ప్రభుత్వ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం మంచిపద్ధతి కాదని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎన్నడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకోసం మాట్లాడని ఉత్తమ్ నేడు ఎన్నికల్లో గెలవలేమనే భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటున్నారని అన్నారు.