సీట్ల కేటాయింపుపై రాహుల్‌ కీలక సంకేతాలు..

T Congress Leader Meets Rahul Gandhi Over TS Pre Poll - Sakshi

రాహుల్‌తో సమావేశమైన టీ కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తమ అధినేత రాహుల్‌ గాంధీతో సమావేశం అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు, కమిటీలు, ప్రచారం, రాహుల్‌ గాంధీ సభలపై సుమారు మూడు గంటలపాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో మంచిపేరున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లోనే టికెట్లు కేటాయిస్తామని రాహుల్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఎక్కడ కాస్త బలహీనంగా ఉందో అక్కడ మహాకూటమి సభ్యులకు సీట్లివ్వాలని చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మహాకూటమితో ముందుకెళ్లాలని రాహులకు టీ కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. పార్టీకి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారని, ప్రచారంలో భాగంగా 10 బహిరంగ సభలకు హాజరువుతానని హామీఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్సేనని రాహుల్‌ తెలంగాణ నేతల్లో ఆత్మవిశ్వాసం నింపారని, భక్తచరణ్‌ దాస్‌ ఛైర్‌పర్సన్‌గా ముగ్గురు సభ్యులతో కూడిన ఓ స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారని ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత తెలిపారు. ఈ కమిటీలో జ్యోతిమణి, సెంథిమలై, శర్మిష్ట ముఖర్జీలను సభ్యులగా నియమించారన్నారు.

టీ కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం: కుంతియా
రాహుల్‌తో పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీనియర్‌ నేతలు, కేంద్రమాజీ మంత్రులతో సహా 38 మంది సమావేశం అయ్యారని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ ఆర్‌సీ కుంతియా తెలిపారు. ప్రతి నేతలో రాహుల్‌ వ్యక్తిగతంగా విడివిడిగా మాట్లాడారన్నారు. నాయకులంతా ఐక్యమత్యంగా పనిచేయాలని కోరారని, మీడియాకు ఎలాంటి వ్యతిరేక వార్తలు ఇవ్వొద్దని సూచించినట్లు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలిపారు. టీడీపీ, వామపక్షాలతో చర్చల బాధ్యత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఇతర నేతలకు ఇచ్చారని, ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షునిదే తుదినిర్ణయమన్నారు. తెలంగాణ ప్రజల కోసం మేం పనిచేస్తామని, హిట్లర్‌, తుగ్లక్‌లా కేసీఆర్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీట్ల పంపకంలో మిత్రధర్మాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌తో భేటీ తర్వాత టీ కాంగ్రెస్‌ నేతలు సంతోషంగా ఉన్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top