తెలంగాణ ప్రజలారా చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి

Sushma Swaraj Fully Support To Telangana Bill In Parliament - Sakshi

రాష్ట్ర ఏర్పాటుకు వెన్నుదన్నుగా నిలిచిన సుష్మాస్వరాజ్‌

చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి అంటూ ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను అర్థం చేసుకున్నాం. తల్లికి పురుడు పోసి తెలంగాణ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు మేమెప్పుడూ అండగా ఉంటాం’’అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ నుంచి గల్లీ వేదికల వరకు పదే పదే చెబుతూ రాష్ట్ర ఏర్పాటుకు మొదట నుంచి అండదండగా ఉంటూ వచ్చిన మహిళా నేత సుష్మస్వరాజ్‌.  ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతి ఆందోళనకు హాజరై రాష్ట్ర ఏర్పాటుకు తొలి నుంచి ఆమె అండగా నిలబడ్డారు.

ముఖ్యంగా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సందర్భంలో కొందరు బీజేపీ అగ్రనేతలే తెలంగాణలో, పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలను తప్పుబట్టినా.. ఇది యూపీఏ ప్రభుత్వం తేల్చాల్సిన అంశమంటూ తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్‌ కోర్టులోకి నెట్టేసినా.. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందేనని పట్టుబట్టి మద్దతుగా నిలిచిన సుష్మాస్వరాజ్‌.. మన రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అగ్రనేతలు ఎల్‌.కే.అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, అరుణ్‌జైట్లీను తెలంగాణకు అనుకూలంగా వారిని ఒప్పించడంలో సుష్మ పోషించిన పాత్ర చాలా కీలకం. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సుష్మస్వరాజ్‌ మాట్లాడిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో  నిలిచిపోతాయి. ‘‘ప్రసవ వేదనను తీర్చే సమయం ఆసన్నమైంది. ఎన్నో త్యాగాల మీద, విద్యార్థుల బలిదానాల మధ్య అనేక మంది ప్రజా పోరాటాలతో పండంటి తెలంగాణ బిడ్డ జన్మించబోతుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటను నిలబెట్టుకున్నాం. ముందు ముందు తెలంగాణబిడ్డ ఎదిగేందుకు వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతాం. తెలంగాణ ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి’’అంటూ ఆమె చేసిన ప్రసంగం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.  

చదవండి: సుష్మా హఠాన్మరణం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top