సుష్మా హఠాన్మరణం

Senior BJP Leader Sushma swaraj passed away - Sakshi

లోధీ రోడ్డులో నేడు అంత్యక్రియలు

ఆర్టికల్‌ 370 రద్దుపై మోదీకి కృతజ్ఙతలు తెలుపుతూ చివరి ట్వీట్‌

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ (67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురవడంతో, అపస్మారక స్థితిలో ఉన్న సుష్మాను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లోని ఎమెర్జెన్సీ వార్డ్‌కు తీసుకువచ్చారు. దాదాపు గంటపాటు ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రాత్రి 10.50 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా  అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ముఖ్యంగా ఆర్టికల్‌ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు. 

లోక్‌సభలో ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రమే ఆమె ట్వీట్‌ చేశారు. ‘నరేంద్ర మోదీజీ.. చాలా చాలా కృతజ్ఞతలు ప్రధాని గారు. ఈ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను’ అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్‌ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే హుటాహుటిన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్‌ జావడేకర్‌ సహా పలువురు కేంద్రమంత్రులు, నేతలు ఎయిమ్స్‌కు చేరుకున్నారు. సుష్మాస్వరాజ్‌ మృతికి రాష్ట్రపతి కోవింద్‌ తీవ్ర సంతాపం తెలిపారు. ‘సుష్మాజీ మృతి వార్త నన్నెంతో షాక్‌కు గురిచేసింది. ప్రజాజీవితంలో గొప్ప దార్శనికతను, ధైర్యాన్ని ప్రదర్శించిన నేతను దేశం కోల్పోయింది’ అని కోవింద్‌ ట్వీట్‌ చేశారు. ఎన్డీయే 1 ప్రభుత్వంలో తన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (చదవండి: సుష్మా చివరి ట్వీట్‌ ఇదే..)

‘భారత రాజకీయాలలో ఒక ఉజ్వల అంకం ముగిసింది. గొప్ప నేత మృతికి నేడు భారత్‌ మొత్తం విలపిస్తోంది. సుష్మాజీ గొప్ప వక్త. అద్భుతమైన పార్లమెంటేరియన్‌. జీవితాంతం ప్రజా సేవకు, పేదల అభ్యున్నతికి ఆమె కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఆమెను అభిమానిస్తారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రయోజనాల విషయంలో ఆమె ఎల్లప్పుడూ రాజీలేని పోరాటమే చేశారని మోదీ గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన అన్ని శాఖల్లోనూ అద్భుత పనితీరును కనపర్చారని, విదేశాంగ మంత్రిగా పలు దేశాలతో భారత్‌ సంబంధాలను మరో ఎత్తుకు తీసుకువెళ్లారని వరుస ట్వీట్లలో కొనియాడారు. 

విదేశాల్లో ఆపదల్లో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు ఎప్పుడూ ముందుండేవారని, ప్రజా సేవలో ఆమె సేవలు మరవలేనియని ప్రధాని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్‌ ఆకస్మిక మృతికి షాక్‌కు గురి చేసిందని కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్‌ మృతి తమనెంతో బాధకు గురి చేసిందని కాంగ్రెస్‌ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. గొప్ప నేత, అద్భుత వక్త, అన్ని పార్టీల్లో ఆప్తులున్న సుష్మాజీ మరణం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’ అని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 

రేపు బీజేపీ హెడ్‌ క్వార్టర్ట్స్‌లో.. 
సుష్మాస్వరాజ్‌ మృతదేహాన్ని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలవరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆ తరువాత లోధీ రోడ్డులో అంత్యక్రియలు జరుగుతాయన్నారు.  

సుప్రీంకోర్టు లాయర్‌గా 
1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్‌ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రధాని మోదీ గత మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

మోదీజీ! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు కోసం నా జీవితమంతా ఎదురుచూశా. – ‘370’ రద్దుపై సుష్మా చివరి ట్వీట్‌..

సుష్మా స్వరాజ్‌ మరణించారని తెలిసి తీవ్రంగా షాక్‌కు గురయ్యాను. ప్రజలు అమితంగా ప్రేమించే ఓ మంచి నాయకురాలిని దేశం కోల్పోయింది. ప్రజా జీవితంలో గౌరవం, ధైర్యం, సత్ప్రవర్తనకు ఆమె మారుపేరులా ఉండేవారు. ఎప్పుడూ ఇతరులకు సాయం చేయాలని తపించేవారు. ఈ దేశానికి ఆమె అందించిన సేవల వల్ల ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతుంది. – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
 
భారత రాజకీయాలలో ఒక ఉజ్వల అంకం ముగిసింది. గొప్ప నేత మృతికి నేడు భారత్‌ మొత్తం విలపిస్తోంది. సుష్మాజీ గొప్ప వక్త. అద్భుతమైన పార్లమెంటేరియన్‌. జీవితాంతం ప్రజా సేవకు, పేదల అభ్యున్నతికి ఆమె కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఆమెను అభిమానిస్తారు. – ప్రధాని నరేంద్ర మోదీ 
 
ఏడుసార్లు లోక్‌సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సుష్మా స్వరాజ్‌ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌ ఆకస్మికంగా మరణించడం బాధాకరం. లోక్‌సభలో విపక్ష నేత పాత్రలో బీజేపీ వాణిని గట్టిగా వినిపించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ కార్యకర్తలందరి తరఫున నేను కోరుకుంటున్నాను.  – అమిత్‌ షా, హోం మంత్రి 
 
నా సహాధ్యాయిల్లో అత్యంత విలువైన వ్యక్తి సుష్మా స్వరాజ్‌ మరణ వార్త విని నేను తీవ్రంగా కలత చెందాను. పార్టీలకతీతంగా ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె మరణం మనకు భారీ లోటు. కింది స్థాయి నుంచి సుష్మ అనేక బాధ్యతలు నిర్వర్తించి విదేశాంగ శాఖ మంత్రి వరకు ఎదిగారు. ఆమె హయాంలో విదేశాంగ శాఖ పనితీరును పూర్తిగా మార్చేశారు. ప్రజల మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో శ్రద్ధ, జ్ఞానంతో సుష్మ ఈ దేశానికి సేవ చేశారు. ఆమె సేవలను దేశం, పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – రాజ్‌నాథ్‌ సింగ్, రక్షణ శాఖ మంత్రి 
 
సుష్మా స్వరాజ్‌ అనూహ్యంగా మరణించడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఆమె నాకు 1990ల నుంచి తెలుసు. మా భావజాలాలు వేరైనప్పటికీ, పార్లమెంటులో ఎన్నోసార్లు మేం ఇద్దరం ఎంతో స్నేహపూర్వకంగా నడచుకున్నాం. ఎంతో గొప్ప రాజకీయ నాయకురాలు, మంచి మనిషి సుష్మ. ఆమెను మనం కోల్పోయాం. సుష్మ కుటుంబ సభ్యులకు నా సానుభూతి. – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం 
 
సుష్మా స్వరాజ్‌ మరణించారని తెలియడంతో నేను షాక్‌కు గురయ్యాను. ఆమె ఓ అసాధారణ రాజకీయ నాయకురాలు. వాక్పటిమను బహుమతిగా పొందిన వక్త. పార్టీలకు అతీతంగా ఆమెకు మిత్రులున్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.     – రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు. 
 
సుష్మా స్వరాజ్‌ మరణ వార్త నన్ను విస్మయానికి గురిచేసింది. ఆమె నన్ను ఎప్పుడూ శరద్‌ భాయ్‌ అని పిలిచేది. మనం ఓ గొప్ప రాజనీతిజ్ఞురాలిని, గొప్ప వక్తను, సమర్థవంతమైన పరిపాలకురాలిని.. వీటన్నింటికీ మించి ఓ దయా హృదయురాలిని మనం ఈనాడు కోల్పోయాం. – శరద్‌ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు 
 
సుష్మా స్వరాజ్‌ మరణ వార్త వినాల్సి రావడం బాధాకరం. ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.     – సీతారాం ఏచూరీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి. 

నాకు మీ మీద చాలా కోపంగా ఉంది సుష్మ అక్క. మనం సంబరాలు చేసుకోవడం కోసం ఓ రెస్టారంట్‌ను ఎంపిక చేయమని బన్సూరీ(సుష్మ కూతురు)కి మీరే చెప్పారు. కానీ మా ఇద్దరికి ఇచ్చిన ఆ మాటను నెరవేర్చకుండానే మీరు ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయారు. – స్మృతీ ఇరానీ, జౌళి శాఖ మంత్రి

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి 
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నేత ఆమె అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మన్ననలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్‌ అని కొనియాడారు. సుష్మాస్వరాజ్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం 
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top