'బుధ్నీ' మే సవాల్‌

Strong competition from Arun Yadav to CM Shivaraj - Sakshi

సీఎం శివరాజ్‌కు అరుణ్‌ యాదవ్‌ నుంచి గట్టిపోటీ

బుధ్నీ ప్రచారం బాధ్యతల్లో చౌహాన్‌ ఫ్యామిలీ 

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సొంత నియోజకవర్గం బుధ్నీలో నువ్వా నేనా అన్నట్టుగా రసవత్తర పోటీకి తెరలేచింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తరఫు నుంచి బలమైన అభ్యర్థి బరిలో లేకపోవడంతో చౌహాన్‌ విజయం నల్లేరు నడకలా సాగింది. కానీ ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఓబీసీ నాయకుడు అరుణ్‌ యాదవ్‌ను బరిలోకి దింపడంతో చౌహాన్‌ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో నెలకొన్న రైతు సమస్యలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగా లేకపోవడం వంటి సమస్యలతో చౌహాన్‌కు విజయం అంత సులభంగా దక్కేలా  కనిపించడం లేదు. 

మామ మంచోడే.. కానీ!
శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రైతు బిడ్డ. కిరార్‌ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గత పదమూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి చాలా చేశారు. ఇప్పుడు అక్కడ విద్యుత్‌ కోతలు లేనే  లేవు. అద్దంలాంటి రోడ్లు తళతళలాడిపోతున్నాయి. బుధ్నీ నుంచి ఎవరు సీఎం కార్యాలయానికి పని నిమిత్తం వచ్చినా వెంటనే ఆ పని జరిగేలా స్వయంగా చౌహానే చూస్తారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రోజుకి 20 గంటలు కష్టపడతారు.  ఇవన్నీ చౌహాన్‌కు కలిసొచ్చే అంశాలే. అయితే కొన్ని పల్లెల్లో నీటి సంక్షోభం తీవ్రంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో వైద్య చికిత్స కోసం కొన్ని పల్లెల్లో ప్రజలు మైళ్లకి మైళ్లు నడవాల్సి వస్తోంది. పక్కనే నర్మదా నది ప్రవహిస్తున్నప్పటికీ ఎన్నో పొలాలకు నీరు అందడం లేదు. తాను రైతు బిడ్డనని ఎన్నికల ప్రచారంలో పదే పదే చౌహాన్‌ గుర్తు చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో రైతులే చౌహాన్‌ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సాగునీరు లేక, పంటలకు మద్దతు ధర రాక ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.  ఇక నర్మద నదిలో ఇసుక మాఫియాకు అండగా ఉంటారన్న ఆరోపణలు చౌహాన్‌పై వ్యతిరేకతను పెంచాయి.  

యాదవ ఓట్లపై నమ్మకంతో..
దిగ్విజయ్‌ సింగ్‌ హయాంలో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన సుభాష్‌ యాదవ్‌ కుమారుడే అరుణ్‌ యాదవ్‌ . 46 ఏళ్ల అరుణ్‌ యాదవ్‌.. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా కూడా పని చేశారు. ఇటీవలే అరుణ్‌ యాదవ్‌ ను తప్పించి కమల్‌నాథ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో అరుణ్‌ యాదవ్‌ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ సీఎంపై యాదవ్‌ను నిలబెట్టింది. ఎందుకంటే బుధ్నీ నియోజకవర్గంలో చౌహాన్‌ సామాజికవర్గానికి చెందిన కిరార్‌ ఓట్లరు ఎంత మంది ఉన్నారో యాదవులు కూడా అంతే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు.  అందుకే కాంగ్రెస్‌ అధిష్టానం యాదవ్‌ను ఏరికోరి రంగంలోకి దింపింది. నర్మద నది తీరం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించిన అరుణ్‌ యాదవ్‌ చౌహాన్‌ సర్కార్‌ను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇసుక మాఫియాకు చౌహాన్‌ కుటుంబం అండగం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. యాదవ్‌ పీసీసీ చీఫ్‌ పదవిని లాగేసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను బలిపశువుని చెయ్యడానికే తనపైన నిలబెట్టిందంటూ శివరాజ్‌ చౌహాన్‌ దీటుగా విమర్శలు చేస్తున్నారు.  

ప్రచారం భాబీదే!
ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. అలాగే చౌహాన్‌ విజయాల వెనుక ఆయన భార్య సాధనా సింగ్‌ చౌహాన్‌ కృషి ఎంతైనా ఉంది. బుధ్నీ నియోజకవర్గం ప్రజలు ఆమెను ప్రేమగా భాబీ అని పిలుస్తారు. చౌహాన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండడంతో సాధన బుధ్నీపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే పరిష్కరిస్తారు. ‘సాధన ఎన్నడూ సీఎం భార్యగా ప్రవర్తించలేదు. అందరినీ సమానంగా చూస్తారు. మాకే సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తారు’ అని స్థానిక మహిళలు చెబుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఆమె ఒక అధికార కేంద్రంగా ఎదిగారు. చౌహాన్‌ గత కొన్నేళ్లుగా తన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోయినా సాధన ఆ లోటు తెలీకుండా వ్యవహారాలను చక్కచెట్టుకుంటూ వస్తున్నారు. కుమారుడు కార్తికేయ చౌహాన్‌ కూడా నియోజకవర్గంలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు.

చౌహాన్‌ వెంటే నీడలా ఉంటూ సాధనా అన్ని అంశాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. బాబూలాల్‌ గౌర్‌ను సీఎంగా తప్పించి చౌహాన్‌ను సీఎంను చేసిన తర్వాత 2006లో బుధ్నీలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలోనే తొలిసారిగా సాధన  కనిపించారు. అప్పట్నుంచి భర్తను గెలిపించే బాధ్యతను తన భుజస్కంధాలపైనే మోశారు. సాధనకూ గ్రహణశక్తి చాలా ఎక్కువ. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా తొందరగా పట్టు సాధించారు. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా, వద్దనుకున్నా నిర్ణయం ఆమెదే. ఇక అధికారుల బదిలీలు కూడా ఆమె కనుసన్నల్లోనే సాగుతాయన్న ఆరోపణలూ ఉన్నాయి. సాధనను పార్టీ కార్యకర్తలు హాఫ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అని పిలుస్తూ ఉంటారు. అదే ఇప్పుడు విపక్షాలకు ప్రచారాస్త్రంగా కూడా మారింది. సాధన అత్యుత్సాహంతో ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం తమకు మేలే చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన వ్యాపమ్‌ సహా ఎన్నో కుంభకోణాల్లో సాధన ప్రమేయమున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సారి కూడా చౌహాన్‌ విజయాన్ని ఒక సవాల్‌గా స్వీకరించిన సాధన తాను ఏదైనా సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో చౌహాన్‌ను గెలిపించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో చౌహాన్‌ 84వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.    

20 మంది మంత్రుల మోహరింపు 
ముఖ్యమంత్రి భార్య సాధనా సింగ్‌ చౌహాన్, ఆయన కుమారుడు కార్తికేయ చౌహాన్‌ కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. అయితే చాలా చోట్ల వారు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. దశాబ్దాలుగా నెలకొన్న  తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించరా.. అంటూ ప్రచార సభల్లో మహిళలు నిలదీస్తున్నారు. చౌహాన్‌ను మామా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే నియోజకవర్గ ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఎదురు కావడంతో చౌహాన్‌ ఏకంగా 20 మంది మంత్రుల్ని రంగంలోకి దింపారు. 

లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం 
చౌహాన్‌ బుధ్నీ నియోజకవర్గం నుంచి  తొలిసారిగా 1990 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత లోక్‌సభకు వెళ్లిపోయారు. తిరిగి 2003 అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయ్‌ సింగ్‌పైన పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్లు తిరక్కుండానే ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇక 2008 ఎన్నికల నాటికి తన పట్టును పెంచుకొని 41 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2013 ఎన్నికల నాటికి చౌహాన్‌ ఇమేజ్‌కు తిరుగే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ నేత మహేంద్ర సింగ్‌ చౌహాన్‌పై 84వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top