వేసవి విడిది కాదు, రాజకీయ వేడిఇది!

The States That Moved MLAs To The Resort For The Past Two Decades - Sakshi

గత రెండు దశాబ్దాల్లో పొలిటికల్‌ రిసార్ట్స్‌కి వేదికగామారిన రాష్ట్రాలవిగో!

వేసవి విడిది కోసం అంతా చల్లని ప్రాంతాలకు పరుగులు పెడుతోంటే, కర్నాటక రాజకీయం నేతల్ని మండుటెండల్లో భాగ్యనగరానికి పరుగులు పెట్టించింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ధాటినుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జెడిఎస్‌ లకు హైదరాబాద్‌ రాజకీయ విడిదిగా మారడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం లే నప్పుడు ఎమ్మెల్యేలను గంపగుత్తాగా తీసుకెళ్లి ప్రత్యర్థులకు చిక్కకుండా దాచిపెట్టే సాంప్రదాయం గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతూ వస్తోంది. పాలిటిక్స్‌లోని ఈ రిసార్ట్‌ రాజకీయాలు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ రాజకీయ విడిదిని ఏర్పాటు చేసాయన్నది ఓసారి చూద్దాం.

హర్యాణా...
 హర్యాణా రాజకీయాలు 1982లో ఇదే రిసార్ట్స్‌ రాజకీయాలకు తెరమీదకొచ్చాయి. అక్కడ కాంగ్రెస్‌కి దీటుగా పురోగమిస్తోన్న లోక్‌ దళ్‌ పార్టీ, బీజేపీల కలయికని కాదని, కాంగ్రెస్‌ని బలనిరూపణ కోసం పిలవడంతో లోక్‌ దళ్‌ అధినేత దేవీలాల్‌ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నుంచి కాపాడుకోవడం కోసం తన పార్టీ  48 ఎమ్మెల్యేలతో సహా, తనకు మద్దతునిస్తానన్న బిజెపి ఎమ్మెల్యేలను ఢిల్లీలోని ఓ హోటల్‌కి తరలించారు. అయితే ఇంత భద్రంగా దాచినా ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది ఆ పార్టీ. ఒక ఎమ్మెల్యే బయటకు పోయే దారిలేక  హోటల్‌లోని పైప్‌లైన్‌పైన జారుకుంటూ తప్పించుకుపోవడంతో చివరకు కాంగ్రెస్‌ పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. 

కర్నాటక...
చాలా రాష్ట్రాలకు రిసార్ట్‌ రాజకీయాల అనుభవం ఉన్నా, కర్నాటకకి మాత్రం ఈ విషయంలో ఎక్కువ అనుభవాలను చవిచూడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. కర్నాటక పలుసందర్భాలో రాజకీయ విడిదికి కేంద్రంగా మారింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు 1983 లో రామకృష్ణ హె గ్డే రిసార్ట్‌ రాజకీయాలు ప్రారంభించారు. 2004, 2006, 2008, 2009–11,  2012 వరకు అనేక సందర్భాల్లో కర్నాటక రాజకీయాలు రిసార్ట్స్‌లో సేదదీరాయి. ప్రధానంగా 2009 నుంచి, 2011 మధ్య కాలంలో ప్రత్యర్థి పార్టీలనుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు దాదాపు 80 మంది బిజెపి ఎమ్మెల్యేలను బెంగుళూరులోని స్టార్‌ హోటల్‌కి తరిలించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ...
మన తెలుగు రాష్ట్రంలో కూడా రిసార్ట్‌ రాజకీయాల్లో స్థానం ఉంది. 1984లో నందమూరి తారక రామారావుని గద్దె దించేందుకు రెండు సార్లు రిసార్ట్‌ రాజకీయాలకు నాంది పలికారు. 1984లో నాటి ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాటి గవర్నర్‌ రామ్‌లాల్‌ ఠాకూర్‌ , ఎన్‌టిఆర్‌ని బర్తరఫ్‌ చేసి, నాదెండ్ల భాస్కర్‌ రావుని ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ నుంచి బెంగుళూరులోని నంది హిల్స్‌కి, అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రభుత్వం పడిపోవడంతో. మళ్ళీ ఎన్‌టి రామారావు రథయాత్ర ద్వారా జనంలోకెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇందిరాగాంధీ ఆరోజు శంకర్‌ దయాళ్‌ శర్మని గవర్నర్‌గా నియమించారు. ఆ తరువాత 1995లో చంద్రబాబు నాయుడు తన మామ ఎన్‌టిరామారావుని గద్దెదించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యేలందర్నీ రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని అప్పటి వైస్రాయ్‌ హోటల్‌కి తరలించి దాచిపెట్టి, ఎవ్వర్నీ కలవనివ్వకుండా కట్టడి చేసారు. బలనిరూపణకు అవసరమైన ఎమ్మెల్యేలను నయానా భయానా దక్కించుకునేవరకూ ఈ నాటకం కొనసాగడం తెలిసిందే. 

గుజరాత్‌ ...
1995లో  47 మంది ఎమ్మెల్యేలున్న శంకర్‌ సింగ్‌ వఘేలా బీజేపీ పైన తిరుగుబాటు చేసి తన ఎమ్మెల్యేలందర్నీ మధ్యప్రదేశ్‌లోని స్టార్‌ హోటల్‌ ఖజురహో తరలించారు. చివరకు ఒప్పందం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌ కి బదులుగా వఘేలా మద్దతుదారుడైన సురేష్‌ మెహతా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అది ఎంతోకాలం నిలవలేదు. తరువాత తన అనుయాయులతో పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. 

ఉత్తర ప్రదేశ్‌ ...
1998 లోక్‌ సభ ఎన్నికల సందర్భంలో కళ్యాణ్‌ సింగ్‌ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని నాటి ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ రమేష్‌ భండారీ డిస్‌మిస్‌ చే శారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జగదాంబికా పాల్‌ ని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన 48 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బలనిరూపణ సందర్భంగా బిజెపి తన సభ్యులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సింగ్‌ కోర్టుకి వెళ్లడంతో తిరిగి అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలతో కళ్యాణ్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 

బిహార్‌...
బీహార్‌లో 2000 సంవత్సరంలో జనతాదళ్‌యూ(జేడీయూ) నేత నితీష్‌ కుమార్‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆçహ్వనించిన సందర్భంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలు తమ శాసన సభ్యులను పాట్నా లోని ఓ హోటల్‌లో దాచిపెట్టారు. అదే సందర్భంలో బలనిరూపణలో ఓటమిపాలవడానికి ముందు నితీష్‌ కుమార్‌ ఏడు రోజులపాటు  ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2005లో లోక్‌ జనశక్తి పార్టీ, బీజేపీ, జేడీయూ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తన ఎమ్మెల్యేలను జమ్‌షెడ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో ఉంచింది.

మహారాష్ట్ర ... 
2002లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ–శివసేన లోకి తన సభ్యులు జారిపోకుండా ఉండేందుకు ఆనాటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ బెంగుళూరులోని హోటల్‌కి తన ఎమ్మెల్యేలను తరలించారు. 

ఉత్తరాఖండ్‌...
2016లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం పడిపోయింది. దీంతో తన సభ్యులను కాపాడుకునేందుకు బిజెపి తన శాసన సభ్యులను తీసుకొని జైపూర్‌లోని ఓ హోటల్‌లో బసచేసింది. ఇరు పార్టీలు గెలుపుగుర్రాల్ని కైవసం చేసుకునేందుకు విపరీతంగా డబ్బు పాచికలు వేసారు. అయితే చివరకు రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్రం తొలుత నిర్ణయించినా అది హైకోర్టు జోక్యంతో ఆగిపోయింది. ఆ తరువాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. 

తమిళనాడు...
తమిళనాడు తమ్ముళ్ళు కూడా ఏం తక్కువ తినలేదనడానికి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతర రాజకీయాలు సాక్ష్యం. 2017లో పన్నీర్‌సెల్వం చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిన అనంతరం ఎఐడిఎంకె నాయకురాలు వి.కె.శశికళ తన ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడుకునేందుకు వాళ్లందర్నీ చెన్నై లోని రిసార్ట్స్‌కి తరలించడం తెలిసిందే.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top