మధ్యప్రదేశ్‌లో కమలానికి షాక్‌..!

State intelligence Predicts Congress Victory In Madhya Pradesh Assembly Elections - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడవడం కమలనాధులను కలవరపరుస్తోంది. అక్టోబర్‌ 30న ముఖ్యమంత్రి చౌహాన్‌కు ఇంటెలిజెన్స్‌ విభాగం ఈ మేరకు సమర్పించిన రహస్య నివేదిక బీజేపీలో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్ధానాల్లో 128 స్ధానాల్లో పాలక బీజేపీ కంటే కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉన్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. బీజేపీ కేవలం 92 సీట్లలోనే గెలుపొందే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది.

మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఆరు సీట్లలో, అఖిలేష్‌ యాదవ్‌ సారథ్యంలోని ఎస్పీ మూడు సీట్లలో విజయం సాధించవచ్చని నివేదిక అంచనా వేసింది. రుస్తం సింగ్‌, మాయా సింగ్‌, గౌరీ శంకర్‌ షెజ్వార్‌, ఎస్పీ మీనా సహా పది మంది మంత్రులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అతితక్కువగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు సీఎం చౌహాన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఎస్పీ మీనా పార్టీ టికెట్‌ రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ నివేదిక ముఖ్యమంత్రికి చేరిన రెండు రోజుల తర్వాతే తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మంత్రి ప్రకటించడం గమనార్హం.

ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం గ్వాలియర్‌ చంబల్‌ డివిజన్‌లోని 34 స్ధానాలకు గాను 24 స్ధానాల్లో కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. బీజేపీ కేవలం ఏడు సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తుండగా, మిగిలిన మూడు సీట్లలో బీఎస్పీకి విజయావకాశాలున్నాయి. వింధ్య ప్రాంతంలోని 30 స్ధానాల్లో కాంగ్రెస్‌ 18 స్ధానాల్లో ప్రత్యర్ధుల కంటే పైచేయి సాధించగా, బీజేపీ 9 స్ధానాల్లో, బీఎస్పీ మూడు స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి.

ఇక మహాకోశల్‌ ప్రాంతంలోని 38 స్ధానాల్లో కాంగ్రెస్‌ 22 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 13 స్ధానాల్లో నెగ్గే అవకాశం ఉంది. ఎస్పీ రెండు స్ధానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇక రైతు ఆందోళనలు, పోలీసు కాల్పులతో అట్టుడికిన మాల్వా నిమర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ 34 స్ధానాల్లో, బీజేపీ 32 స్ధానాల్లో గెలిచే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top