వర్లిలో కుమార సంభవమే!

shivasena focus on Aditya Thackeray Majority in worli - Sakshi

ఆదిత్య మెజార్టీపైనే అందరి దృష్టి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణ ముంబైలో అందరి దృష్టి వర్లి నియోజకవర్గంపై పడింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో యువ సేనాని ఆదిత్య ఠాక్రే దిగడంతో ఈ సీటుపై చర్చ సాగుతోంది. ఆయన గెలుపుపై కాకుండా మెజార్టీ ఎంత వస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. వర్లి ఎప్పట్నుంచో శివసేనకు కంచుకోట. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. బీజేపీ–సేన కూటమి గెలిస్తే ఆదిత్య ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇక ఆదిత్యపై పోటీకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి సురేశ్‌ మానె దళిత నాయకుడు. ఆయన స్థానిక నేత. పక్కా లోకల్‌ అన్న ప్రచారంతోనే ఆదిత్యకు పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

వర్లి ఒక మినీ మహారాష్ట్ర
ఈ నియోజకవర్గం మినీ మహారాష్ట్రను తలపిస్తుంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరైన వర్లి గత కొద్ది ఏళ్లలో రూపురేఖలు మారాయి. ఆకాశహర్మ్యాలు, అధునాతన వాణిజ్య భవనాలు వచ్చాయి. వాటి పక్కనే మురికివాడల్లో ప్రజలూ ఉన్నారు. చాల్స్‌ (ఇరుకు గదులుండే నాలుగైదు అంతస్తుల భవంతులు)లో ఉద్యోగులు ఉన్నారు. భిన్న కులాలు, మతాలు, విభిన్న భాషలు ఇలా ఈ ఒక్క నియోజకవర్గం మహారాష్ట్రకు నమూనాలా ఉంటుంది. మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తెలుగు వారితోపాటు ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇలా భిన్న తరహా ఓటర్లను ఆకర్షించడం సులభమేమీ కాదు. దానికి తగ్గట్టుగానే ఆదిత్య ప్రచారంలో ముందున్నారు. ‘సలాం వర్లి’ అంటూ వివిధ ప్రాంతీయ భాషల్లో భారీ కటౌట్లు ఉంచి మరాఠీయేతరుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరే కాలనీలో వందల భారీ వృక్షాల నరికివేత, ముంబై నైట్‌ లైఫ్‌ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, ఆద్యితకు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ మద్దతుపలికారు.

ఆదిత్యకు కలిసొచ్చేవి
► బాల్‌ ఠాక్రే వారసత్వం  
► సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం
► ముంబై లైఫ్‌ వంటి అంశాల ప్రస్తావన  
► అభివృద్ధి మంత్రం

సురేశ్‌ మానెకు అనుకూలమివీ..  
► దళిత కార్డు
► లోకల్‌ ఇమేజ్‌  
► ఇంటింటికీ తిరగుతూ ప్రజలతో అనుసంధానం  
► వివిధ భాషల వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు  

గతంలో ఫలితాలు ఇలా..  
► 1990 నుంచి ఎన్నికల ఫలితాలను చూస్తే సేన ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది.  
► 1990 నుంచి 2004 ఎన్నికల వరకు శివసేన నుంచి దత్తాజీ తనవాందే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సచిన్‌ ఆహిర్‌ గెలుపొందారు. రాజ్‌ ఠాక్రేకు చెందిన ఎంఎన్‌ఎస్‌ ఓట్లు భారీగా చీల్చడంతో ఎన్సీపీ అభ్యర్థికి లాభం చేకూరింది.  
►  2014లో శివసేన అభ్యర్థి సునీల్‌ షిండే గెలుపొందారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top