ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..

Several BJP leaders make a comeback - Sakshi

గతంలో మరుగునపడిన ప్రముఖులు కేంద్ర మంత్రివర్గంలోకి  

న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్‌ ముండా, రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్‌ ముండా జార్ఖండ్‌కు, రమేశ్‌ పోఖ్రియాల్‌ ఉత్తరాఖండ్‌కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్‌ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది.

అర్జున్‌ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్‌ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు.

ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్‌కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్‌ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్‌కు బీజేపీ ప్రభుత్వం హెచ్‌ఆర్‌డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్‌ పటేల్‌ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్‌ను మంత్రిగా నియమించలేదు.

ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్‌ సింగ్‌ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌ బాల్యన్‌ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్‌ సింగ్, సంజీవ్‌లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top