
చాలామంది నాయకులు బీజేపీలో చేరటానికి సిద్దంగా వున్నారని సతీశ్ చెప్పారు.
సాక్షి, విజయవాడ: రాబోయే రోజుల్లో ఏపీలో తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, ఏపీ ఇన్‌ఛార్జి సతీశ్ వెలాంకర్ అన్నారు. ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు బీజేపీలో చేరటానికి సిద్దంగా వున్నారని చెప్పారు. గాంధీనగర్ కందుకూరి కళ్యాణమండపంలో అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఆవిర్భావించిందో వాటిని చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని, జన్మభూమి కమిటీలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని, అందుకే టీడీపీ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని సతీశ్ వ్యాఖ్యానించారు. యోగ దినోత్సవంలో సతీశ్‌తో పాటు ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్, వంగవీటి నరేంద్ర, తదితర నాయకలు పాల్గొని యోగాసనాలు వేశారు. (చదవండి: బీజేపీలోకి బాబు కోవర్టులు!)