తెలుగు జాతి పరువు తీస్తున్న బాబు

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం 

ఓటమి భయంతో ఈవీఎంలపై నెపం నెట్టేస్తున్నారు 

ఎవరికి ఓటు వేశారో కనిపించకపోతే అప్పుడే ఎందుకు అడగలేదు?

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో, ఈవీఎంలు పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామా ఆడుతున్నారని, తెలుగు జాతి పరువు తీసేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎవరికి ఓటు వేశారనేది కనిపించకపోతే అప్పుడే ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి శనివారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఒక గుర్తుపై నొక్కితే మరో గుర్తుకు ఓటు పడుతోందని, వీవీప్యాట్లలో గుర్తు కనిపించడం లేదంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఆయన మానసిక స్థితి బాగలేదనిపిస్తోందని చెప్పారు. మానసిక వైద్యులే చంద్రబాబు స్థితిని నిర్థారించాలని అన్నారు. చంద్రబాబు అసలేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... 

‘‘పోలింగ్‌కు ఓ రోజు ముందు నుంచే చంద్రబాబు పెద్ద డ్రామాకు తెరతీశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఆయనకు 10వ తేదీనే సమాచారం అందింది. సానుభూతి కోసం విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేయాలని ముందే నిర్ణయించారు. ఎన్నికల సంఘం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది వద్దకు వెళ్లి దబాయించారు. ఆ తరువాత కొంతసేపు అక్కడే ధర్నాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పోలింగ్‌ రోజు నానా యాగీ చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలవబోతున్నారని ఇంటెలిజెన్స్‌ నివేదికలు వచ్చాయి. కానీ, అప్పట్లో ప్రజాతీర్పు అందుకు విరుద్ధంగా వచ్చింది. జగన్‌ ఆ తీర్పును ఎంతో హుందాగా స్వీకరించారు. కానీ, ఇప్పుడు పోలింగ్‌ ముగిసిన వెంటనే చంద్రబాబు చిన్నపిల్లలు కూడా అసహ్యించుకునేలా ప్రవర్తించారు. 

చంద్రబాబు నాటకాల వెనుక పెద్దకుట్ర 
ఓటర్లకు బిస్కెట్లు ఇవ్వలేదని చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కోప్పడుతున్నారు, ఓటు వేయడానికి క్యూలో ఉండే వాళ్లకు బిస్కట్లు ఇస్తూ ఉంటారా? పోలింగ్‌ నిర్వహణ బాధ్యతను అనుభవజ్ఞులైన ఉద్యోగులకు కాకుండా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు అప్పగించారు. అందువల్లనే ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీనికి పరోక్షంగా చంద్రబాబే కారణం. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోందని, పార్టీ అవసాన దశలో ఉందనే విషయం చంద్రబాబుకు అర్థమైంది. అందుకే హైడ్రామాకు తెరతీశారు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.  

బాధ్యత వహించాల్సింది బాబు ప్రభుత్వమే 
రాష్ట్రంలో 80 శాతం పోలింగ్‌ జరిగింది. ఏ ఒక్కరూ ఈవీఎంలపై ఫిర్యాదు చేయలేదు. తాను వేసిన ఓటు తెలుగుదేశం పార్టీకి పడిందో లేదో తనకే తెలియదని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కంప్యూటర్‌ తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నా రంటే ఆయనకు ఏదో అయి ఉండాలి. 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి 80 శాతం పోలింగ్‌ ఎలా జరిగింది? ప్రతి ఎన్నికల్లోనూ కొన్ని ఈవీఎంలు మొరాయించడం సర్వసాధారణమే. నిజంగా పోలింగ్‌ నిర్వహణలో ఎవరైనా అక్రమాలకు పాల్పడి ఉంటే ఫిర్యాదు చేయొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో విధినిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేస్తున్న వారే కదా. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top