ప్రార్థనా మందిరాలు కూల్చారు...ఈ సర్కారు మనకొద్దు

Religious Gurus Fires On Chandrababu Naidu - Sakshi

దేవాలయాలు, దర్గాలు, చర్చిలంటే లెక్కేలేదు

బెజవాడలో 43 ఆలయాల్ని కూల్చారు

చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన తరుణమిదే

మంచిచెడులు ఆలోచించేవారికి ఓటు వేయండి

ఓట్ల కోసం మతాల్లో చిచ్చు పెట్టే వారిని నమ్మకండి

చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగిన పలువురు మతగురువులు

సాక్షి, అమరావతి : అధికారం అండతో ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పేట్రేగి పోయిందని.. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మనోభావాలని దెబ్బతీస్తూ వారి ప్రార్థనా మందిరాలను అడ్డగోలుగా కూల్చివేసిందని పలువురు మతగురువులు ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధమైందని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తరుణం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల మంచిచెడుల గురించి ఆలోచించే పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగాగురు బాబా పాండురంగం, కపాలానంద స్వామి, బిషప్‌ కాటూరి ప్రభుదాస్, ముస్లిం మత గురువులు అబ్దుల్‌ కరీమ్‌ రిజ్వీ, సయ్యద్‌ ఖలీల్‌ అహ్మద్‌ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యంగబద్ధంగా అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తూ పరిపాలన చేయాల్సిన టీడీపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా హిందూ, ముస్లిం, క్రైస్తవుల పట్ల లెక్కలేనితనాన్ని, చులకన భావాన్ని ప్రదర్శించిందని ఆరోపించారు. ముఖ్యంగా విజయవాడలో పుష్కరాల పేరిట 43 దేవాలయాలు కూల్చివేసిందని పేర్కొన్నారు. దీని వెనుక విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని శ్రీనివాస్‌ (నాని) హస్తం ఉందన్నారు. అలాగే పవిత్ర ముస్లిం దర్గాపై దుర్గగుడి ఫ్‌లై ఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టవద్దన్నా ఎంపీ నాని ఒత్తిడితో దాన్ని పూర్తి చేస్తున్నారని తెలిపారు. అలాగే బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని ఓ చర్చిని కూలగొట్టి.. కనీసం మరోచోట నిర్మించడానికి ముందుకురాలేదని వివరించారు. ఇలా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. పైగా ఇన్నేళ్లు బీజేపీతో అంటకాగి బయటకొచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీతో పొత్తు ఉన్నట్లు ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టీడీపీ కుట్రలను అన్నివర్గాలవారు గమనించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేసే పార్టీకి ఓటు వేయాలని మత గురువులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మసీదులు, దర్గాలనుకూల్చే వారికి ఓటు వేయొద్దు
మసీదులు, దర్గాలను కూల్చే వారికి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయకపోయినా నష్టమే జరుగుతుంది కాబట్టి కచ్చితంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడేవారిని ఎన్నుకోండి. – అబ్దుల్‌ కరీమ్‌ రిజ్వీ, ముస్లిం మతగురువు

కేశినేని కో హఠావో.. బెజవాడ కో బచావో!
రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం విజయవాడ ఎంపీ కేశినేని నాని దేవాలయాలను కూలగొట్టించారు. ఇలాంటి వారికి పతనం తప్పదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ కుటిల రాజకీయాలకు యత్నిస్తున్నారు. మా మనోభావలను దెబ్బతీసిన వారిని మేము ఎన్నటికీ మర్చిపోలేదు. రాజధాని ప్రాంతం విజయవాడలో అన్నివర్గాలు ప్రశాంతంగా జీవించాలన్నా.. బెజవాడను రక్షించాలన్నా.. ఈ ఎన్నికల్లో ‘కేశినేని కో హఠావో.. బెజవాడ కో బచావో’ అనే నినాదంతో ప్రజలు ఓట్లు వేయాలి. – బాబా పాండురంగం, యోగ గురు

దశాదిశ కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి...
 క్రైస్తవులు, ముస్లింలు, హిందువులకు నష్టం కలిగించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఎన్నికల సమయంలో మొసలికన్నీరు కారుస్తూ మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. విజయవాడలో బీఆర్‌టీఎస్‌ రహదారిలోని ఓ చర్చిని పాలకులు అన్యాయంగా కూల్చివేశారు. దానిని మరో చోట నిర్మించాలని కోరినా మొండివైఖరి చూపారు. అధికారపార్టీ నాయకుడెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి బాధ్యత కలిగిన, నిర్దిష్టమైన ఆలోచనలు కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. – కాటూరి ప్రభుదాస్‌ యాదవ్, బిషప్‌

ఏడు కొండలు, కనకదుర్గను రక్షించేవారికే ఓటు వేయండి 
త్రిపురలో ఉండే నేను ఇక్కడకు వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే తెలుగు కూడా నేర్చుకున్నా. నాలుగు నెలల కిందట విజయవాడకు వచ్చి వెళ్లాను. ఈ రాష్ట్రంలో మనందరికీ తెలిసినవాడు ఏడు కొండలవాడు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. పైగా అర్చకులకు అరకొర వేతనాలు ఇస్తున్నారు. కొందరికీ అసలే లేవు. ఏడు కొండలస్వామిని, కనకదుర్గను రక్షించే వారికే ఓటు వేయాలి. – కపాలనంద స్వామి, హిందూ మతగురువు

టీడీపీ అరాచకాలను ముస్లింలు మర్చిపోరు
విభజన తర్వాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును ప్రజలు గద్దెనెక్కించారు. ఈ ఐదేళ్లలో జరిగినన్ని అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు మరెప్పుడూ జరగలేదు. పుష్కరాలను అడ్డుపెట్టుకుని దేవాలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టారు. రామవరప్పాడులో ముస్లింల దర్గాను కూల్చివేశారు. ఆ ఘటనను ముస్లింలు ఎవ్వరూ మర్చిపోలేరు. – సయ్యద్‌ ఖలీల్‌ అహ్మద్‌ రిజ్వీ, ముస్లిం మతగురువు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top