
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్‌రెడ్డిపై పారిశ్రామికవేత్త ఎ.రామేశ్వరరావు దాఖ లు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి స్పెషల్ సెషన్స్ జడ్జి కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రామేశ్వరరావుకు రూ.2 వేల కోట్ల విలువైన భూములను ఉచితంగా కేటాయించిందంటూ రేవంత్ గతంలో ఆరోపణలు చేశారు. దీంతో రేవంత్‌పై రామేశ్వరరావు 2015లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
మొదట ఈ కేసులో 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. అనంతరం ఈ కేసు స్పెషల్ సెషన్స్ జడ్జికి బదిలీ అయింది. రామేశ్వరరావు కేసును స్వీకరించిన స్పెషల్ సెషన్స్ జడ్జి కోర్టు తదుపరి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టగా.. రేవంత్ చేసిన ఆరోపణలు ఎంత మాత్రం పరువు నష్టానికి సంబంధించినవి కావని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వాదించారు.
ప్రజాప్రాముఖ్యతకు చెందిన విషయాలను ప్రజలకు వివరించడం ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యతని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే రామేశ్వరరావు ఈ కేసు దాఖలు చేశారన్నారు. మొదట 17వ అదనపు సీఎంఎం కోర్టులో ఉన్న కేసును పిటిషనర్‌కు తెలియకుండానే స్పెషల్ సెషన్స్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.