రాష్ట్రాన్ని వీడనున్న చంద్రగ్రహణం 

BY Ramaiah Slams On Chandrababu Naidu - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మే 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాలతో రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడనుందని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటింగ్‌ అనంతరం ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉన్నారని తెలిసి చంద్రబాబు మానసిక స్థితిని కోల్పోతున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన హుందాగా వ్యవహరించాల్సిందిపోయి ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని, ఎన్నికల కమిషన్‌పై పోరాటం, నరేంద్రమోదీ ఓటమి కోసం దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారని ధ్వజమెత్తారు. ఈవీఎంల పనితీరుపై నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్‌ రావు స్పీకర్‌ వ్యవస్థనే దిగజార్చారన్నారు. ఎమ్మెల్యే పుష్పశ్రీపై దాడి జరిగినా పట్టించుకునే నాథుడే లేకపోవడం.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శమన్నారు.

జనసేన పార్టీ ఆఫీస్‌కు టూలెట్‌ బోర్డు.. 
ఎన్నికలు ముగిసిన వెంటనే విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయానికి టూ లెట్‌ బోర్డు పెట్టారన్నారు. మే 23 తరువాత రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి కూడా అదేనన్నారు. ఎన్నికల నిబంధనలను పక్కనబెట్టి కమీషన్ల కోసం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం, రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష చేయడంపై ఆయనకు కమీషన్లపై ఎంత మమకారం ఉందో అర్థమవుతోందన్నారు. ఐదేళ్లలో వాటి గురించి ఏనాడు పట్టించుకోకుండా ఈ నెల రోజుల్లో హడావుడి చేయడం తగదన్నారు. నీరు–చెట్టు నిధుల దుర్వినియోగంపై తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణ చేపడతామన్నారు.

సైలెంట్‌ ఓటింగ్‌.. టీడీపీ కిల్లింగ్‌.. 
జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని బీవై రామయ్య జోస్యం చెప్పారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున యువత, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ఓటు వేశారన్నారు. సైలెంట్‌ ఓట్లన్నీ వైఎస్సార్‌సీపీకేనని, అవన్నీ టీడీపీ కిల్లింగ్‌ కోసం పడినవేనని అభిప్రాయపడ్డారు.  

సీఎం మాటలు హాస్యాస్పదం.. 
జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమని కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌ అన్నారు. ఇంటిలిజెన్స్‌తో పాటు సొంత సర్వేలు కూడా టీడీపీ ఓడిపోతుందని చెబుతున్నా చంద్రబాబు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే మానసిక వ్యాధికి గురయ్యారనే విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పును అంగీకరించకుండా దేశం పట్టుకొని తిరగడం ఎందుకని ప్రశ్నించారు.

మే 23 తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్‌ కంటే ముందే ఈవీఎంలపై ఆరోణలు చేయడాన్ని బట్టి చూస్తే పరోక్షంగా చంద్రబాబు ఓటమిని అంగీకరించారన్నారు. వయసు పైబడడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలసి విశ్రాంతి తీసుకుంటే మంచిదని సురేంద్రరెడ్డి హితవు పలికారు. కార్యక్రమంలో కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ జె.సుధాకర్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, ధనుంజయాచారి, షరీఫ్, మహేశ్వరరెడ్డి, విజయ్, బాలరాజు, శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ తులసిరావు చౌదరి, డాక్టర్‌ స్వర్ణలత పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top