సీఎం కేసీఆర్‌వి కట్టుకథలు

Rajeev Gowda Comments on KCR - Sakshi

     మోదీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకే ప్రయత్నాలు

     ఏఐసీసీ అధికార ప్రతినిధి,ఎంపీ రాజీవ్‌గౌడ  

సాక్షి, హైదరాబాద్‌: ఫెడరల్‌ ఫ్రంట్, థర్డ్‌ ఫ్రంట్‌ అనేవి కట్టుకథలు మాత్రమేనని, ప్రధాని మోదీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ఎం.వి.రాజీవ్‌గౌడ ఆరోపించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయినప్పుడు మాత్రమే ఆ పార్టీ విజయం సాధించిందని, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటంతో ఓటమిపాలైందని చెప్పారు. 2014 నుం చి జరిగిన ఏ ఒక్క లోక్‌సభ ఉప ఎన్నికలోనూ ప్రతిపక్షాల నుంచి ఒక్క సీటును కూడా బీజేపీ సాధించలేకపోయిందని, ఇప్పుడు ప్రతిపక్షాల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనలు చేయడం, బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకేనని ఆయన ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న లౌకిక పార్టీలన్నీ ఏకమయితే బీజేపీని గద్దె దింపడం సులువవుతుందని, అందుకే ప్రతిపక్ష ఓట్లను చీల్చి మోదీని గెలుపుబాట పట్టించేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని అన్నారు. దేశప్రయోజనాలను పరిరక్షించడం జాతీయ పార్టీలతోనే సాధ్యమన్నారు. కేసీఆర్‌ ఎంత ప్రయత్నించినా మోదీ ఒక్కసారి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచి పోవడం ఖాయమని, బీజేపీ నుంచి ఈ దేశానికి విముక్తి కలుగుతుందని ఆయన అన్నారు. 

వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు
మోదీ హయాంలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తున్నారని రాజీవ్‌గౌడ ఆరోపించారు. లోక్‌పాల్, సీబీఐ, ఆర్‌బీఐ, సుప్రీంకోర్టు, ఆర్టీఐ.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యవస్థలూ దారుణ స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు చాలా తెలివిగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించి రఫేల్‌ కుంభకోణంలో క్లీన్‌చిట్‌ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై పార్టీ అధిష్టానం సమీక్ష జరుపుతోందన్నారు. తెలంగాణ తెచ్చిందన్న కారణంతో తెలంగాణ ప్రజలు వరుసగా రెండోసారి టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారని, తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

గాంధీభవన్‌లో క్రిస్మస్‌ వేడుకలు
గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన క్రిస్మస్‌ వేడుకల్లో రాజీవ్‌గౌడ పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి తెలంగాణ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దాసోజు శ్రవణ్, అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్‌ నాయకుడు డోకూరి పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top