చేజేతులారా...

Rahul Gandhi leads Congress to political wilderness - Sakshi

ఎన్నికల్లో బెడిసికొట్టిన కాంగ్రెస్‌ వ్యూహాలు

నెహ్రూ మార్గంతోనే పార్టీకి పునరుజ్జీవం  

‘ఈసారి ప్రధానిగా మోదీ కాకుంటే మరెవరు?’.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజల్లో వినిపించిన ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానమే లభించలేదు. మహాకూటమిగా పోటీచేసి మోదీ నేతృత్వంలోని బీజేపీని నిలువరించాలనీ, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న కాంగ్రెస్‌ వ్యూహం ఫలించలేదు. చాలాచోట్ల బీజేపీ నేతలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకలేదు. దీనికితోడు ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లో సయోధ్య విషయంలో విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం, పలుచోట్ల త్రిముఖ పోరు ఏర్పడ టంతో ఎన్డీయే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 352 స్థానాల్లో విజయదుందుభి మోగించింది.

పనిచేయని ‘చౌకీదార్‌’ నినాదం..
సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే రఫేల్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆరోపించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌకీదార్‌ చోర్‌ హై(కాపలాదారు దొంగగా మారాడు) అని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని పదేపదే ప్రస్తావించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనివల్లే బీసీలు, ఎస్సీ, ఎస్టీల జనాభా గణనీయంగా ఉన్న చాలాప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్స్‌..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్‌ నుంచి ఈసారి రాహుల్‌ పోటీచేశారు. ఒకవేళ రెండుచోట్ల రాహుల్‌ విజయం సాధిస్తే ఆయన వయనాడ్‌ను ఎంచుకుంటారని అమేథీలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. అదే సమయంలో మోదీపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక బరిలోకి దిగుతారని కవ్వించి, చివరికి అజయ్‌రాయ్‌ను అభ్యర్థిగా నిలపడం కూడా పార్టీకి కలిసిరాలేదు. దీనికితోడు ఢిల్లీలో ఆప్, యూపీలో ఎస్పీ–బీఎస్పీ, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌ వ్యవహారశైలి ఆ పార్టీ పాలిట శరాఘాతంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బెంగాల్‌లో 2 సీట్లకు పరిమితమైంది. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన సోనియాగాంధీ పార్టీ పరువును నిలిపారు.

నేలకొరిగిన హేమాహేమీలు..
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ సునామీకి పలువురు కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నేతలకు ఓటమి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్, మహారాష్ట్రలో అశోక్‌ చవాన్, మిలింద్‌దేవ్‌రా, సుశీల్‌కుమార్‌ షిండే, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, ఢిల్లీలో షీలా దీక్షిత్‌ వంటి హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మోదీని సాగనంపుతామని బీరాలు పలికిన మమతా బెనర్జీకి పశ్చిమబెంగాల్‌లో షాక్‌ తగిలింది. 2014లో 36 సీట్లను దక్కించుకున్న మమత.. ఈసారి 22 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యారు. ఇద్దరు ఎంపీలున్న బీజేపీ ఏకంగా 18 చోట్ల విజయం సాధించింది. ఇక యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

నెహ్రూ బాటలో నడిస్తేనే..
స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి,  దివంగత జవహర్‌లాల్‌ నెహ్రూ సారథ్యంలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్‌ ఉనికి కోసం పోరాడుతోంది. వాస్తవానికి 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో కాంగ్రెస్‌ బలహీనపడటం మొదలుపెట్టింది. 2004లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్, 2009లో మరోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారంలోకి వచ్చాక భజనపరులు చుట్టూ చేరారు. పార్టీని సైద్ధాంతికంగా బలపర్చడం పక్కనపెట్టి తదుపరి ప్రధాని రాహుల్‌ గాంధీయేనని కాంగ్రెస్‌ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజా వ్యతిరేకత తీవ్రమై 2014లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ఓటమిని చవిచూసింది.  ఇప్పటికైనా పార్టీలో భజనపరులను పక్కనపెట్టి, సైద్ధాంతికంగా నెహ్రూ బాటలో నడిస్తేనే కాంగ్రెస్‌ పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతిపక్ష హోదా మళ్లీ పాయే..
130 ఏళ్ల చరిత్ర.. ఎందరో ప్రధానమంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ సొంతం. కానీ, కాలం కలిసిరాకపోతే ఏమవుతుందో పదేళ్లుగా ప్రత్యక్షంగా అనుభవిస్తోంది ఆ పార్టీ. 2014 ఎన్నికల్లో మోదీ హవాలో చచ్చీచెడీ 44 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది తెలిసిందే. సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేను కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నా... ఆయనకు ప్రతిపక్ష నేత హోదా మాత్రం దక్కలేదు. అయితే ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే కావడంతో ఖర్గే లోక్‌సభ, సీబీఐ డైరెక్టర్, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐదేళ్లలో సత్తువ కూడగట్టుకుని ఈ హోదాకు కావాల్సిన పదింట ఒకవంతు స్థాయి సీట్లయినా గెలుస్తుందని చాలామంది ఆశించారు. అయితే, తాజా ఎన్నికల్లో 50 సీట్లకు  అటూఇటుగా పరిమితం కావడంతో కాంగ్రెస్‌కు ఈసారీ ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేకుండాపోయాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top