‘కోమటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు’

Rahul gandhi congratulates komatireddy and sampath kumar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లు శుక్రవారం భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరు రాహుల్‌తో సమావేశమై తాజా పరిణామాలను వివరించారు. ఇరువురు ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డిలు రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు ఉదంతం సహా కోర్టు తీర్పును రాహుల్‌ గాంధీకి వివరించినట్టు  తెలిపారు. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ చేసిన కృషిని రాహుల్ అభినందించారన్నారు. కోమటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.

ఏస్థాయిలోనైనా పోరాటం ఉధృతం చేయాలని చెప్పారన్నారు. అసలు సభను అగౌర పరిచింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని.. అడ్డగోలుగా సభను అగౌరపరిచి నడపాలనుకున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు. ఆధిక్యం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని.. నియంతృత్వ ధోరణి పనికి రాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్, స్పీకర్‌ మధుసూదనచారి వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ రెండురోజుల పాటు బస్ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా మీడియా సృష్టేనని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు శుభపరిణామమని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుంతియా అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్పును గౌరవించాలని ఆయన సూచించారు.

రాహుల్‌ గాంధీతో భేటి అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లు మీడియాతో మాట్లాడుతూ.. ‘నెలన్నర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాహుల్ తెలుసుకున్నారు. అన్ని తెలుసుకుని మా ఇద్దరిని అభినందించారు. రాహుల్ పిలుపు మేరకు ఢిల్లీ వచ్చి ఆయనతో సమావేశమయ్యాం. 45 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ భేటీలో రాహుల్ ఇచ్చిన సందేశం మాలో ఉత్సాహాన్ని పెంచింది. కోర్టు తీర్పు స్ఫూర్తిగా అన్ని విషయాల్లో పోరాటం చేయండి.. మీ వెంట మేముంటామని రాహుల్‌ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అదే విధంగా లాయర్‌ జంధ్యాల రవిశంకర్‌ను కూడా ఆయన అభినందనలు చెప్పారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయాలని రాహుల్‌ సూచించారు. కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top