నేరుగా రాలేను.. ‘కూటమి’తో వచ్చా

Rahul Gandhi and Chandrababu Naidu Public Meeting - Sakshi

జాతి ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో దోస్తీ: చంద్రబాబు

కేంద్రం, రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టాల్సిందే

రాజకీయాల్లో కేసీఆర్‌ను పెంచి పోషించింది నేనే

టీఆర్‌ఎస్‌... తెలంగాణ ఆరెస్సెస్‌: రాహుల్‌

హైదరాబాద్‌లో రాహుల్, చంద్రబాబు రోడ్‌షోలు

సాక్షి నెట్‌వర్క్‌: ‘‘హైదరాబాద్‌ నా మానస పుత్రిక. ఇక్కడి అభివృద్ధిలో అడుగడుగునా నా కృషి ఉంది. ఈ నగరం ముందుకు పోతే చూసి ఆనందిద్దామనుకున్నా. కానీ ప్రగతి కుంటుపడింది. నేను చేసిన అభివృద్ధి ఫలాలు తెలుగుజాతికి అందకుండా పోవడం తో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టా. నేను డైరెక్టుగా ఇక్కడికి వచ్చి పాలన చేయలేను.. కాబట్టి ప్రజా కూటమి ద్వారా అభివృద్ధి ఫలితాలను మీకందించాలని వచ్చా’’అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం, కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీశాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కేసీఆర్‌ అంటే.. ఖావో కమీషన్‌ రావు అని, టీఆర్‌ఎస్‌ అంటే.. తెలంగాణ ఆరెస్సెస్‌ అని ఎద్దేవా చేశారు. సోమవారం ముషీరాబాద్, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థులతో కలసి రోడ్‌ షో నిర్వహించిన చంద్రబాబు, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి రోడ్‌షోల్లో రాహుల్‌తో కలసి పాల్గొన్నారు.

అంతా నేనే...
ముషీరాబాద్, ఖైరతాబాద్‌ రోడ్‌షోల్లో చంద్రబాబు ప్రసంగించారు. మోదీ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేస్తూ ప్రజాప్రతినిధులపై, పత్రికలపై దాడు లు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ని ప్రపంచ పటం లో పెట్టింది టీడీపీయేనని, నగరంలో హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైల్, ఎయిర్‌ పోర్టు వంటి అనేక ప్రాజెక్టులను ప్రారంభించానన్నారు. ముషీరాబాద్‌లో ఎన్టీఆర్‌ స్టేడియం, అధునాతన గాంధీ ఆసుపత్రిని నిర్మించానన్నారు. హైదరాబాద్‌తోనే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిందన్నారు.

తాను చేసిన అభివృద్ధిని కాంగ్రెస్‌ పార్టీ ముందుకు తీసుకెళ్లిందని, కానీ ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్పితే అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. 37 ఏళ్లపాటు తాను కాంగ్రెస్‌తో పోరాడనని ప్రజాస్వామ్య వ్యవస్థ ను కాపాడటం కోసం అదే పార్టీతో కలసి పనిచేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసింది తన స్వార్థం కోసం కాదని, జాతి ప్రయోజనాల కోసమన్నారు. మాయమాటలు చెప్పి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, పెత్తనం చేయడానికి ఇక్కడికి రాలేదని తెలిపా రు. తాను ఇక్కడ సీఎంగా ఉండటానికి అవకాశం లేదని తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే టీఆర్‌ఎస్‌ కూటమి మేనిఫెస్టోను కాపీ కొట్టిందన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం రహస్య స్నేహం
రాహుల్‌ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐ ఎం రహస్య స్నేహం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ అవివేకంగా చేసిన నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. సీబీఐ సహా అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌గా మారిపోయరన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి, సంక్షేమానికి, అవినీతి రహిత పాలన కోసం మహా కూటమికి పట్టం కట్టాలని కోరారు.

కేసీఆర్‌... జూనియర్‌ మోదీ..
టీఆర్‌ఎస్, బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని బాబు అన్నారు. కేసీఆర్‌ను జూనియర్‌ మోదీగా అభివర్ణించారు. కేంద్రంలో, రాష్ట్రంలో దారితప్పిన పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం తనకు ఉందన్నారు. ప్రత్యామ్నా య రాజకీయ వ్యవస్థ రావాలని అందుకే ప్రజా కూటమి ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాకూటమి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌పై బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుకు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కృషి చేశారన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాను ఆలోచిస్తుంటే కేసీఆర్‌ మాత్రం తెలుగువారి మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శిం చారు. తనకు ఇక్కడేం పని అని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారని. తాను లేకుంటే కేసీఆర్‌ ఎక్కడని ప్రశ్నిం చారు. రాజకీయాల్లో కేసీఆర్‌ను పెంచి పోషిం చింది తానేనన్నారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుంటే పనులు కావని జనంలోకి వస్తేనే పనులవుతాయన్నారు. హైదరాబాద్‌లో అన్ని సీట్లు ప్రజాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలు తనను ఎన్ని తిట్లుతిడితే ప్రజల నుంచి తనకు అంతగా ఆదరణ లభిస్తుందన్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top