రాజ్యసభకు కొత్తగా నలుగురు

Profiles of newly-nominated members of Rajya Sabha - Sakshi

రాకేశ్‌ సిన్హా, రామ్‌ సకల్, రఘునాథ్‌ మహాపాత్రో, సోనాల్‌ మాన్‌సింగ్‌లకు అవకాశం

నామినేట్‌ చేసిన రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ/భువనేశ్వర్‌: ఇటీవల ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నామినేటెడ్‌ స్థానాలు భర్తీ అయ్యాయి. ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త రాకేశ్‌ సిన్హా, లోక్‌సభ మాజీ సభ్యుడు రామ్‌ సకల్,  సంప్రదాయ నృత్యకారిణి సోనాల్‌ మాన్‌సింగ్, శిల్పి రఘునాథ్‌ మహాపాత్రోలు రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్‌ వీరిని ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ప్రకటించింది. ఇటీవలే పదవీకాలం ముగిసిన  క్రీడాకారుడు సచిన్, నటి రేఖ, న్యాయవాది పరాశరణ్, సామాజిక కార్యకర్త అను ఆగాల స్థానంలో వీరిని ఎంపికచేశారు. వీరి పదవీకాలం 2024లో ముగుస్తుంది.

రామ్‌ సకల్‌: యూపీలోని రాబర్ట్స్‌గంజ్‌ నియోజక వర్గం నుంచి 3సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా రామ్‌ సకల్‌ దళితులు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం పోరాడారని పీఎంవో కొనియాడింది.

రాకేశ్‌ సిన్హా: ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త అయిన సిన్హా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధో సంస్థ ‘ఇండియా పాలసీ ఫౌండేషన్‌’ని స్థాపించారు. ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాల మోతీలాల్‌ నెహ్రూ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌)లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

రఘునాథ్‌ మహాపాత్రో: 1959 నుంచి శిల్పకళలో విశేష కృషి చేస్తూ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. పూరీజగన్నాథ ఆలయ సుందరీకరణలో పాలుపంచుకున్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లోని ఆరు అడుగుల సూర్య భగవానుడి రాతి శిల్పం ఈయన సృష్టే. పద్మశ్రీ, పద్మ భూషణ్‌ పురస్కారాలు లభించాయి.

సోనాల్‌ మాన్‌సింగ్‌: ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిస్సీ కళారూపాల్లో సేవలందిస్తున్నారు. వక్త, సామాజిక కార్యకర్త కూడా అయిన ఈమె పద్మ విభూషణ్‌ పురస్కారం పొందారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top