ప్రకాష్‌ రాజ్‌ నిశ్శబ్ద ఉద్యమం

Prakash Raj silent movement - Sakshi

పల్లె ప్రజల హక్కులపై చైతన్యం..

ప్రకాష్‌ రాజ్‌... ప్రముఖ సినీ నటుడు... బహుభాషా ప్రేక్షకులకు ప్రియమైన విలన్‌. నిజ జీవితంలో మాత్రం అణగారిన వర్గాల ప్రియతమ హీరో. బెంగళూరులో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ స్నేహితుడిగా ఆమె చైతన్యాన్ని అందిపుచ్చుకున్నానని ప్రకటించుకొన్నాడు. అభ్యుదయ వేదికల్లో ఆమె ఆదర్శాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పిన ప్రకాష్‌ రాజ్‌ అంతే దృఢంగా ప్రజాస్వామ్య కాంక్షాపరుడినని స్పష్టం చేశారు. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలనూ, అరాచకాలనూ బహిరంగంగా సవాల్‌ చేశారు.

ఆ తరువాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే తన ఎజెండా అని ప్రకటించారు. కన్నడ నాట బీజేపీయేతర పార్టీలను గెలిపించండని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే కర్ణాటక ఎన్నికల తరువాత ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమయ్యారు. సోషల్‌ మీడియాలో కూడా పెద్దగా కనిపించిందీ లేదు. ప్రకాష్‌రాజ్‌ ఎక్కడికెళ్లినట్టు? అని ఆరాతీస్తే అభ్యు దయ భావాలుగల ప్రకాష్‌రాజ్‌ పల్లెసీమల్లో పచ్చటి పంట పొలాల్లో, పూరి గుడిసెల్లో, కప్పులేని పాఠశాలల్లో... చిన్నారుల ఆటస్థలాల్లో... పసివారి నల్లని పలకలపై తెలతెల్లని అక్షరాల్లో... మొత్తంగా కన్నడ రాష్ట్రంలోని నిరుపేద గుండెల్లో మెలమెల్లగా మెరిసిపోతున్నాడు. అందుకే ఇప్పుడు కర్ణాటక గ్రామసీమల్లో ప్రకాష్‌ రాజ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  

ప్రజాచైతన్యం కోసం... 
ఎక్కడో పల్లెజనాలను వెతుక్కుంటూ వెళ్లి వారిని చైతన్యం చేసే పనిలో తలమునకలై ఉన్నారు ప్రకాష్‌ రాజ్‌. జస్ట్‌ ఆస్కింగ్‌ పేరుతో మొన్నమొన్నటి వరకూ కేవలం సవాళ్లకే పరిమితమైన ప్రకాష్‌రాజ్‌ ప్రస్తుతం ఒకడుగు ముందుకేసి కార్యాచరణకు సైతం పూనుకుంటూ ప్రజల్లో విద్య పట్ల, ఆరోగ్యం çపట్ల అవగాహన రేకెత్తిస్తున్నారు. సంక్షేమం ఎవరో వేసిన భిక్ష కాదని, అది ప్రజల డబ్బని.. ప్రజల హక్కనీ వారికి తెలియజెపుతున్నాడు. అలాగే పాఠశాలలను, ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వాలు నెలకొల్పినా, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనంటూ సామాజిక బాధ్యతను ప్రజలు గుర్తెరిగేలా చేస్తున్నారు. తను పాఠశాలలను దత్తత తీసుకుంటున్నానని వస్తున్న వార్తల పట్ల ప్రకాష్‌ రాజ్‌ స్పందిస్తూ ‘‘దత్తత తీసుకోవడానికి నేనెవరిని? పాఠశాల అందరి సొత్తు. ముఖ్యంగా ప్రజల సొత్తు. దాన్ని కాపాడుకోవాల్సింది వాళ్లేనని’’ తేల్చి చెప్పి వారిని మెప్పించి ఒప్పించారు.

భిక్ష కాదు..మన హక్కు
మన దగ్గర డబ్బులు లేక పోవచ్చు. కానీ మన పిల్లల చదువులే వారికి మనమిచ్చే సంపద. మీ స్కూలు మీ హక్కు. నిజమైన విద్య ప్రైవేటు పాఠశాలల్లో లేదు. అది ఒక బిజినెస్‌ మాత్రమే. పేదలకో శిక్షణ, పెద్దల బిడ్డలకో శిక్షణ కాదు. దళితుడికోరకమైన చదువు, ఇతరులకో చదువు కాదు. అందరికీ సమానమైన విద్య ప్రజల హక్కు. అది ప్రభుత్వ బాధ్యత. ఏది బిజినెస్‌ అవుతుందో అది ప్రజల సొంతం కాదు. ప్రతి పౌరుడికీ సమాన విద్యావకాశాలు, ఆరోగ్యం అనేది ప్రభుత్వం నెరవేర్చాల్సిన కనీస బాధ్యతలు. మన భవిష్యత్తుకోసం పౌరులంతా చేతులు కలపాలంటూ ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ నిశ్శబ్దంగా ఉద్యమిస్తున్నారు ప్రకాష్‌రాజ్‌. దేవాలయ ప్రాంగణాలను శుభ్రం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కుట్టుమిషన్లు ఉచితంగా పంచడం, ఆటల పట్ల ఆసక్తి పెంచేందుకు క్రికెట్‌ టోర్నమెంట్లను ఏర్పాటు చేయడంతోపాటు లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఆన్‌లైన్‌లోనూ వైద్యసేవలందించేవారిని పరిచయం చేస్తున్నారు ప్రకాష్‌ రాజ్‌. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top