ఆగుతూ.. సాగుతూ పోలింగ్‌

Polling On Warangal District - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు ముదురు టనలు మినహా పోలింగ్‌ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికారులు సమస్యాత్మకంగా గుర్తించిన జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 4గంటలకే ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది.

అరగంట నుంచి గంట ఆలస్యం పోలింగ్‌ ప్రారంభం సమయంలో వరంగల్‌ అర్భన్, వరంగల్‌ రూరల్, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో అక్కడక్కడా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) మొరాయించడంతో అరగంట నుంచి గంటన్నర ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది. దీంతో చాలాచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అయితే, నిర్ణీత సమయం లోగా కేంద్రాలకు వచ్చిన వారందరూ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కాగా వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో జరిగిన పోలింగ్‌ వివరాలను గురువారం రాత్రి అధికారులు వెల్లడించారు. వరంగల్‌ లోక్‌సభ పరిధిలో 60.41 శాతం, మహబూబాబాద్‌లో 64.46 శాతంగా నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల పేరిట విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల్లోనూ పోలింగ్‌ శాతం భారీగా తగ్గడం గమనార్హం.

మందకొడిగా ప్రారంభమై..
వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని చోట్లా ఉదయం ఏడు గంటలకు మందకొడిగా మొదలైన పోలింగ్‌ 9 గంటల తర్వాత పుంజుకుంది. చాలాచోట్ల ఈవీ ఎంలు మొరాయించడం కారణంగా ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ ముగిసే సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సమస్యాత్మక నియోజకవర్గం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4 గంటలే కాగా, మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా రాత్రి వరకు పోలింగ్‌ కొ నసాగించారు. సాయంత్రం 5 గంటల వరకు వరంగల్‌ పార్లమెంట్‌ పరి«ధిలో 60.41 శాతం, మహబూబాబాద్‌ పరిధిలో 64.46 శాతంగా పోలింగ్‌ నమోదైనట్లు రాత్రి 10.30 గంటలకు ఆయా జిల్లాల రిటర్నింగ్‌ అధికారులు వెల్లడించారు.

మొరాయించిన ఈవీఎంలు
అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగినా... మొత్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూరు మండలం కంఠాత్మకూరు, చిల్పూరు మండలం మల్కాపూర్, హసన్‌పర్తి మండలం మడిపెల్లి, వరంగల్‌ 27వ డివిజన్‌ ఏవీవీ కళాశాల పోలింగ్‌ బూత్‌ 87, పర్వతగిరి మండలం చింతనెక్కొండలో 238, ఆత్మకూరులో 105 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు చాలాసేపు మొరాయించాయి.

మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధి నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం కొనపురం బూత్‌ నెంబర్‌ 195, బొజేరువులో 221 పోలింగ్‌ కేంద్రాల్లోను ఈవీఎంలు మొరాయించాయి. వీటితో పాటు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు పరిస్థితులను చక్కదిద్ది పోలింగ్‌ సజావుగా సాగేలా చూశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల పోలీసు కమీషనర్లు, ఎస్పీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో గస్తీ బందాలు,  స్రైకింగ్‌ ఫోర్సు, పోలీసుల పహారా పెంచారు. 

ఓటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు గురువారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భార్య ఈటల జమున, కుమారుడు, కూతురు, కోడలుతో కలిసి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్‌ పర్వతగిరిలో ఓటేశారు. ఇక రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్‌ వారి స్వగ్రామం హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో ఓటు వేశారు.

హన్మకొండ టీచర్స్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కుటుంబసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.బొల్లికుంటలో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, కుటుంబ సభ్యులు, నక్కలగుట్ట వాటర్‌ట్యాంక్‌ బూత్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కుటుంబసభ్యులు, వడ్డెపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాలలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కుటుంబసభ్యులు, వరంగల్‌ పెరుకవాడలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ కుటుంబీకులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ట్స్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, జాయింట్‌ కలెక్టర్‌ దయానంద్, హన్మకొండలో వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత, జులైవాడలోని ఎస్టీ హాస్టల్‌ పోలింగ్‌ బూత్‌లో టీఎన్జీఓస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఓటు వేశారు. 

గణనీయంగా తగ్గుదల
2014 సాధారణ ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గింది. వరంగల్‌ లోక్‌సభ పరి«ధిలో 2014లో 76.56 శాతం పోలింగ్‌ నమోదు కాగా ఈసారి 63.08 శాతానికే పరిమితమైంది. అంటే 13.48 శాతం పోలింగ్‌ తగ్గినట్లు. అదే విధంగా మహబూబాబాద్‌ లోక్‌సభకు 2014లో 82.81 శాతం పోలింగ్‌ జరగగా, ఈసారి 13.70 శాతం తగ్గి 69.11 శాతానికే పరిమితమైంది. కాగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో తొలుత పోలింగ్‌ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ తీరును ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎన్నికల పరిశీలకులు వీణా ప్రదాన్, అమిత్‌కుమార్‌ సింగ్‌లు పలు కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, శివలింగయ్య, కలెక్టర్లు హరిత, వినయ్‌కృష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లులు పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top