ఆ విషయంలో కాంగ్రెస్‌, పాక్‌ ఒకటే.. | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో కాంగ్రెస్‌, పాక్‌ ఒకటే..

Published Tue, Apr 9 2019 1:30 PM

PM Modi Says Congress Manifesto Echoes Pakistan Stand On Kashmir   - Sakshi

ముంబై : లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించిన మ్యానిఫెస్టో కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌ వైఖరిని సమర్ధిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్‌ తీరును తప్పుపట్టారు. జమ్ముకశ్మీర్‌ నుంచి ఆర్టికల్‌ 370ని తొలగించవద్దని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పేర్కొనగా, ఇదే అంశాన్ని పాకిస్తాన్‌ సైతం చెబుతోందని దుయ్యబట్టారు.

భద్రతా వ్యవస్ధను నిర్వీర్యం చేసేలా ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌ సహా ఆ పార్టీ మిత్రపక్షాలు దేశ వ్యతిరేక వైఖరితో చెలరేగుతున్నాయని విమర్శించారు. పాకిస్తాన్‌ వాడుతున్న పదజాలాన్నే కాంగ్రెస్‌ సైతం వినిపిస్తోందని ఆరోపించారు. భారత్‌ను ముక్కలు చేయాలని భావిస్తూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నవారు దేశంలో స్వేచ్ఛగా తిరగాలని కాంగ్రెస్‌, పాకిస్తాన్‌ కోరుకుంటున్నాయని అన్నారు. ఉగ్రవాదులను వారి శిబిరాల్లో మట్టుబెట్టాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు హింసోన్మాదంతో చెలరేగుతుంటే తాము చేతులు ముడుచుకుని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Advertisement
Advertisement