పోరాడలేక నా తల్లిపై దూషణలా?

PM Modi attacks Congress for dragging his mother into election debate - Sakshi

అవినీతి కాంగ్రెస్‌ సంస్కృతిలో భాగం

కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డ ప్రధాని మోదీ

ఛత్తర్‌పూర్‌/మంద్‌సౌర్‌: తనతో పోరాడే శక్తిలేని కాంగ్రెస్‌ నేతలు తన తల్లి హీరాబెన్‌ లక్ష్యంగా దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా తన చేతిలో ఓడిపోతున్న కాంగ్రెస్‌ నేతలు, పోరాడేందుకు మరే విషయం దొరక్కపోవడంతోనే వృద్ధురాలైన తన తల్లిని ఈ వివాదంలోకి లాగారని దుయ్యబట్టారు. దేశంలో రూపాయి విలువ మోదీ తల్లి వయస్సుకు దిగజారిందని కాంగ్రెస్‌ నేత రాజ్‌ బబ్బర్‌ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఈ మేరకు స్పందించారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఛత్తస్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో విపక్షాలపై మోదీ నిప్పులు చెరిగారు.

ఆమెకు రాజకీయాలంటేనే తెలియదు..
‘ఈ కాంగ్రెస్‌ నేతలకు నరేంద్ర మోదీపై పోరాడే శక్తి లేదు. 17–18 సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రతీసారి సవాల్‌ చేయడమే కాకుండా చిత్తుచిత్తుగా ఓడిస్తున్నా. కానీ మీరు ఈ రాజకీయ రొంపిలోకి నా తల్లిని లాగుతున్నారా? కాంగ్రెస్‌ నేతలకు ఇది సరైనదేనని అనిపిస్తోందా? మోదీపై చేసిన విమర్శలేవీ పనిచేయకపోవడంతో కాంగ్రెస్‌ నేతలు నా తల్లి హీరాబెన్‌ను దుర్భాషలాడుతున్నారు. ఆమెను అవమానిస్తున్నారు. కానీ నా తల్లికి రాజనీతి(రాజకీయం) అనే పదంలో ఆర్‌ అనే అక్షరానికి అర్థం కూడా తెలియదు’ అని అన్నారు.  

మాది రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం కాదు
ఈ సందర్భంగా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిం చారు. ‘నా ప్రభుత్వాన్ని ఓ మేడమ్‌(సోనియా) తన ఇంట్లో కూర్చుని రిమోట్‌ కంట్రోల్‌ తో నియంత్రించడం లేదు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నా హైకమాండ్‌. మేడమ్‌ హయాంలో ధనికుల కోసం బ్యాంకుల ఖజానాలను ఖాళీ చేసేశారు.  కానీ, మా ప్రభుత్వం యువతకు సాధికారత కల్పిస్తోంది. అవినీతి అన్నది నాలుగు తరాల కాంగ్రెస్‌లో అనాదిగా వస్తున్న ఆచారం, సంస్కృతి. నోట్ల రద్దు తర్వాత తప్పుడు పేర్లు, చిరునామాలతో నడుస్తున్న మూడు లక్షల డొల్ల కంపెనీలు మూతపడ్డాయి.’ అని మోదీ తెలిపారు. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు వస్తున్న ఆదరణ చూసి నామ్‌దార్‌(రాహుల్‌), రాజా (దిగ్విజయ్‌), మహారాజా (జ్యోతిరాదిత్య సింధియా)లు కలత చెందుతున్నారని ప్రధాని ఆరోపించారు.

పటేల్‌ తొలి ప్రధాని అయ్యుంటే..
భారత తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఉంటే దేశంలో రైతులు నాశనమయ్యేవారు కాదని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ తప్పులు, లోపభూయిష్టౖ నిర్ణయాలతో రెతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ లోపాలను సరిదిద్దేందుకు కొంత సమయం అవసరమనీ, అయితే తనకు నాలుగేళ్ల కాలం మాత్రమే లభించిందని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలకు లభించిన సమయంలో సగం కాలం తనకు అధికారం అప్పగించినా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తానన్నారు. పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) అంటూ నాడు ఇందిర ఇచ్చిన నినాదం నేటికీ నెరవేర లేదని విమర్శించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top