వెయ్యి పింఛన్లు ఆపేశారు

People Worry About New Pension Scheme - Sakshi

అధికార పార్టీ నేతల ఒత్తిడి

జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్లు పంపిణీ

ప్రొద్దుటూరులో నిలిపివేతలబ్ధిదారుల్లో ఆందోళన  

ప్రొద్దుటూరు :జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్‌ నెలకు పింఛన్లు మంజూరు అవుతాయా కావా అన్న అనుమానాలు ఓవై పు ఉంటే, మరో వైపు మళ్లీ జాబితా తయారు చేస్తే తమ పేర్లు ఉంటాయో ఉండవోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 2వేల పింఛన్లు మంజూరు చేయడంతోపాటు ఈనెల 1 నుంచి పింఛన్‌దారులకు డబ్బుపంపిణీ చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాకు 20వేల వృద్ధాప్య, దివ్యాంగుల, వితంతు, చేనేత పింఛన్లు మంజూరు కాగా ఇందులో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2వేలు మంజూరయ్యాయి. వీటిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలకు 1000 పింఛన్లు, మిగతా 1000 పింఛన్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కేటాయించారు. జన్మభూమి కమిటీ సభ్యులు ఇచ్చిన లేఖల ఆధారంగా మున్సిపల్‌ అధికారులు సంతకం చేసిన జాబితాను ప్రభుత్వానికి పంపారు. మున్సిపల్‌ అధికారులు పంపిన జాబితా లో తాము సూచించిన పేర్లు లేవని, పింఛ న్ల జాబితాను నిలిపివేయాలని అధికార పార్టీ నేతలు స్వయంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు. దీంతో ప్రొద్దుటూరులో పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. 1000 మందికి కలిపి రూ.11లక్షలు మంజూరైంది.

గతంలోనూ ఇలాగే జరిగింది
గత ఏడాది ఆఖరులో మున్సిపాలిటీ పరిధిలోని 77 మంది చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరయ్యాయి. ఈ జాబితాకు సంబంధించిన డబ్బు కూడా మంజూరైంది. అయితే తమకు తెలియకుండా పింఛన్లు మంజూరు చేశారని అధికార పార్టీ నేతలు పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వారం రోజుల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చివరికి జిల్లా అ«ధికారులు జో క్యం చేసుకుని చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేశారు. ఆ సమయంలో అప్రతిష్టను మూటకట్టుకున్న అధికార పార్టీ నేతలు మరో మారు ఈ విధంగా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా జరిగింది
మున్సిపాలిటీకి 1000 పింఛన్లు మంజూరు కావడంతో అధికార పార్టీ నేతలు తమ ఇష్టానుసారం పింఛన్లను వార్డులకు కేటా యించారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా పింఛన్లు మంజూరు చేశారు. ఓ వార్డుకు వంద వరకు పింఛన్లు మంజూరు కాగా మరికొన్ని వార్డులకు 20 కూడా లేవు. ఇక్కడ అధికార పార్టీ నేతలు వివక్ష ప్రదర్శించారు.

త్వరలో వస్తాయి
మున్సిపాలిటీ పరిధిలో 1000 పింఛన్లకు సంబంధించిన జాబితా తయారు చేసి మున్సిపల్‌ అధికారులకు ఇచ్చాం. అయితే ఇక్కడి నుంచి రెండు జాబితాలు వెళ్లాయి. ఈ కారణంగా తమ జాబితా ప్రకారం పింఛన్లు మంజూరు చేయాలని చెప్పాం. పింఛన్లు ఆగిపోయాయని హంగామా చేస్తున్నారు. కలెక్టర్‌ రెండు మూడు రోజుల్లో మంజూరు చేస్తారు.     – ఆసం రఘురామిరెడ్డి,
మున్సిపల్‌ చైర్మన్, ప్రొద్దుటూరు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top