
సాక్షి, కాకినాడ : నిన్న నటుడు ఆలీపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సునీల్ జనసేనలో చేరుతానంటూ తన టైమ్‌ను చాలా వృధా చేశాడంటూ విమర్శలు గుప్పించారు. అతడిని చూస్తుంటే కాలాన్ని హరించేవాడనిపిస్తోందంటూ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తనకు చాలా సంతోషమని... సునీల్ చంద్రబాబు మనిషని..జీవితాంతం చంద్రబాబు కాళ్ల దగ్గర కూర్చొని భజన చేసుకోండంటూ సునీల్‌ను ఎద్దేవా చేశారు. కావాలంటే తాను రెండు చిడతలు కొని పంపిస్తానంటూ పరుష వ‍్యాఖ్యలు చేశారు. తాను అధికార, ప్రతిపక్ష పార్టీలకు భయపడేది లేదని పవన్ తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే కులమతాలకు అతీతంగా పాలన చేస్తామన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మోదీ అంటే తనకు గౌరవమే కానీ, ఎలాంటి భయం లేదని అన్నారు.