‘ప్రధానులనూ విచారించి.. చంద్రబాబును వదిలేస్తారా’

Parthasarathy Slams Chandrababu In Cash For Vote Case - Sakshi

చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టులో చెప్పారు

కేసుల భయంతోనే విజయవాడకు పారిపోయిన చంద్రబాబు

సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి కోరారు. ఎమ్మెల్యే ఓటు కొనేందుకు రూ.50 లక్షలు చంద్రబాబు ఇప్పించారని, ఆపై ఆడియో టేపుల్లో వాయిస్ ఆయనదేనని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయాలను చూసిన తర్వాత ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం పోయిందన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయలేవనే ధీమాతో టీడీపీ నేతలున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పార్ధసారధి కోరారు. ఓటుకు కోట్లు కేసులో సీబీఐ లేదా ఉ‍న్నత స్థాయి సంస్థతో విచారణ జరపాలన్నారు.

ఓటుకు కోట్లు కేసు రెండు రాష్ట్రాల సమస్య కాదని, కానీ ఈ కేసు కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మోకరిల్లి హైదరాబాద్‌ను వదిలిపెట్టి విజయవాడకు పారిపోయి వచ్చారని గుర్తుచేశారు. కేవలం ఈ కేసు భయంతోనే పదేళ్ల రాజధాని హైదరాబాద్‌ను చంద్రబాబు వదులుకున్నారని తెలిపారు. 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టారని, అనవసరమైన ఆర్థిక భారాన్ని ప్రజలపై ఏపీ సీఎం వేశారని విమర్శించారు. తెలంగాణ అక్రమం ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అడ్డుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులుగా ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబుపై ఎందుకు విచారణ చేయట్లేదదని ప్రశ్నించారు.

కోర్టు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్‌సన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేస్తుందనే భయంతోనే నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీకి చంద్రబాబు ఊడిగం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం అంటే చంద్రబాబుకు పిచ్చిరాతగా ఉంది. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న చంద్రబాబు కొన్నారని, ఎందుకంటే ఈ రాజ్యాంగం తనను ఏం చేయలేదని ఏపీ సీఎం భావిస్తున్నారని పార్ధసారధి వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top