క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయికి..

Padma Rao to be new deputy speaker - Sakshi

పద్మారావుగౌడ్‌కు డిప్యూటీ స్పీకర్‌!

కార్పొరేటర్‌ నుంచి ఎదిగిన నేత  

సాక్షి, సిటీబ్యూరో: మాజీ మంత్రి పద్మారావుకు మరో ఉన్నత పదవి దక్కింది. 1986లో మోండా డివిజన్‌ నుంచి కార్పోరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పద్మారావు ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఇక ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించనున్నారు. ఆయన ఎన్నిక దాదాపు లాంఛనమే అయినా, శనివారం నామినేషన్‌ వేయనున్నారు. ఇదిలా ఉండగా మోండా మార్కెట్‌ కేంద్రంగానే పద్మారావుతో పాటు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1986 మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మారావు విజయం సాధించగా, జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన శ్రీనివాస్‌ యాదవ్‌ ఓటమి పాలయ్యారు.

దివంగత నేత పీజేఆర్‌కు ప్రధాన అనుచరుడిగా కొనసాగిన పద్మారావు 1999 ఎన్నికల్లో సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు.  ఆ తర్వాత 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి 2002లో మరోసారి మోండా డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలో దిగి... ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన... అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో తలసానిపై ఓడిపోయారు. 2009లో పొత్తుల్లో భాగంగా మహాకూటమి అభ్యర్థిగా సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసిన పద్మారావు... మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎక్సైజ్‌ మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి దాదాపు 45వేల మెజారీటీతో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా సాదాసీదా జీవితం గడిపే పద్మారావు... తాను పుట్టి పెరిగిన టకారా బస్తీలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో బంగళా ఇచ్చినా తాను అమితంగా ఇష్టపడే బస్తీలోనే ఉంటూ తన వాళ్ల మధ్యే గడుపుతుండడం విశేషం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top