ఆ దొంగల పేరు చివర మోదీ

One Modi giving away crores to other Modis - Sakshi

కాపలదారే దొంగ అయ్యాడు!

మిగతా మోదీలకు ఓ మోదీ కోట్లు దోచిపెడుతున్నారు: రాహుల్‌

డెహ్రాడూన్‌: ప్రధాని మోదీ దేశంలోని మిగతా మోదీలకు కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమాన్ని శనివారం ఉత్తరాఖండ్‌లో రాహుల్‌ ప్రారంభించారు. ఈ దొంగలందరికీ పేరు చివర మోదీ అనిఉండటం ఒక ఎత్తు అయితే అందులో నుంచి ఒక మోదీ మిగతా మోదీలకు ఎందుకు దోచిపెడుతున్నారని ప్రశ్నించారు.

తన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌లో నిందితుడు నీరవ్‌ మోదీ, ఐపీఎల్‌ స్కామ్‌ నిందితుడు లలిత్‌ మోదీలు ఉన్నారన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని వారు తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. కాపలాదారే దొంగ అయ్యాడని (చౌకీదార్‌ చోర్‌ హై) రాహుల్‌ విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 15–20 మందికి మాత్రమే కోట్ల రూపాయలు ఇచ్చారని, రైతులు, నిరుద్యోగుల సంక్షేమానికి ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో అదానీ గ్రూప్‌ వ్యాపార సంస్థలకు భూమిని దోచిపెట్టారని విమర్శించారు.

పేదలకు ఆర్థిక భరోసా..
కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పేదలకు ఆర్థిక భద్రత కల్పనలో భాగంగా కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడతామని రాహుల్‌ గాంధీ హామీనిచ్చారు. ఇందులోభాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన మొదటి దేశంగా భారత్‌ నిలుస్తుందన్నారు.

అప్పుడు కెమెరాలకు పోజ్‌లిస్తున్నారు...
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడి జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కెమెరాలకు పోజ్‌లిస్తున్నారని విమర్శించారు. పుల్వామా దాడి జరిగిన వెంటనే తాను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నానని, కానీ మోదీ మాత్రం మూడున్నర గంటలపాటు నేషనల్‌ జియోగ్రాఫిక్‌ డాక్యుమెంటరీ షూటింగ్‌లో ఫొటోలకు పోజులిచ్చారని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top