నాడు ఒప్పు.. నేడు తప్పట! 

Observers shocked of the TDP Manner - Sakshi

గన్నవరం విమానాశ్రయంలోతనిఖీలపై టీడీపీ రాద్ధాంతం 

బీసీఏ నిబంధనల మేరకే బాబుకు తనిఖీలు 

నాడు ప్రతిపక్ష నేతగా భద్రతా నిబంధనలు పాటించిన వైఎస్‌ జగన్‌  

టీడీపీ తీరుపై ఆశ్చర్యపోతున్న పరిశీలకులు

సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో నిబంధనల మేరకు చంద్రబాబుకు భద్రతా తనిఖీలు నిర్వహించడంపై టీడీపీ నానా యాగీ చేస్తోంది. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏ) నిబంధనలను అధికారులు పాటించినప్పటికీ టీడీపీ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. టీడీపీ అసత్య ప్రచారం, అనవసర రాద్ధాంతం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన కాన్వాయ్‌ నేరుగా విమానాశ్రయం రన్‌వే వరకు వెళ్లేది. సీఎం హోదాలో చంద్రబాబుకు తనిఖీలు లేకుండానే విమానంలోకి అనుమతించేవారు.

ఆయన ప్రస్తుతం సీఎం కాదు. ప్రతిపక్ష నేత. దాంతో నిబంధనల మేరకు విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు చేయించుకుని వెళ్లాలి. ఆ ప్రకారమే అధికారులు విమానాశ్రయంలోని చెక్‌ ఇన్‌ పాయింట్‌ వద్ద చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించారు. అనంతరం ఆయన ఇతర ప్రయాణికులతో పాటు బస్‌లో కాసేపు ప్రయాణించి విమానం వద్దకు చేరుకున్నారు. దీనిపై టీడీపీ నానా రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది.  

జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న ప్రముఖులకు మినహాయింపు లేదు 
విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపునిస్తూ బీసీఏ పేర్కొన్న జాబితాలో మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు, జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న ప్రముఖులు లేరు. ఆ మూడు కేటగిరీల పరిధిలోకి వచ్చే చంద్రబాబుకు భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదన్నది స్పష్టమవుతోంది. ఎస్పీజీ భద్రత ఉన్న ప్రముఖులకు మాత్రమే విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియా కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంది. చంద్రబాబుకు ఉన్నది జెడ్‌ ప్లస్‌ భద్రత. ఆయనతో పాటు దేశంలోని మరికొందరు ప్రముఖులకు కూడా జడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నారు. వారికి విమానాశ్రయాల వద్ద భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదు.

విమానాశ్రయాల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు తనఖీలపై బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ కచ్చితమైన నిబంధనలను రూపొందించింది. ప్రోటోకాల్, విదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, భద్రతా కారణాలతో 32 కేటగిరీలకు చెందిన ప్రముఖులకు విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చింది. వారిలో మాజీ సీఎంలు, ప్రతిపక్ష నేతలు, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్నవారు లేకపోవడం గమనార్హం. వైఎస్‌ జగన్‌ గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నిబంధనలను కచ్చితంగా పాటించడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top