ముందస్తు రాదు..

Not before on Sabha polls - Sakshi

లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ వర్గాలు

గంట పాటు కూడా అధికారాన్ని వదులుకోబోమని స్పష్టీకరణ

51 శాతం ఓట్ల సాధనే లక్ష్యం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: షెడ్యూల్‌ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ముందస్తుకు అవకాశమే లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. లోక్‌సభతో పాటు 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల తలెత్తిన గందరగోళానికి తెరదించాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐదేళ్లు అధికారంలో కొనసాగేలా ప్రజలు తీర్పునిచ్చారని, అందుకు కనీసం గంట ముందు కూడా గద్దెదిగబోమని తేల్చిచెప్పాయి. దేశవ్యాప్తంగా 51 శాతం ఓట్లు గెలుచుకోవడమే తమ లక్ష్యమని, ప్రతిపక్షాల ఐక్యతను చెడగొట్టే ఉద్దేశం లేదని తెలిపాయి. మోదీకి రాహుల్‌ గాంధీ సరితూగరని, ఆయన్ని కాంగ్రెస్‌ తన ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే, అది తమకు లాభమే చేకూరుస్తుందని అన్నాయి. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని కైరానా ఉప ఎన్నికల్లో బీజేపీ 47 శాతం ఓట్లు పొందడాన్ని ఉదహరించాయి.  

14 కోట్ల మంది కార్యకర్తలతో సైన్యం
బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని, ఒక్కో బూత్‌లో 25 మంది చొప్పున మొత్తం 7 లక్షల బూత్‌లలో కార్యకర్తలను నియమించుకున్నట్లు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని, వారందరి ఫోన్‌ నంబర్లు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు అధ్యక్షుడు అమిత్‌ షా వద్ద ఉన్నాయని చెప్పాయి. కార్యకర్తలతో షా తరచూ సమావేశమవుతూ వారిని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారని తెలిపాయి. బీజేపీ ఎంపీలంతా అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు అందుబాటులో ఉండేలా గురువారం, శుక్రవారం వారికి భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేయాలని పార్టీ విప్‌లను ఆదేశించినట్లు వెల్లడించాయి. సభకు హాజరై అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసేలా తమ పార్టీ సభ్యులందరికీ విప్‌ జారీచేశామని, దాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top