మహిళలకు భద్రత కరువు : భట్టి విక్రమార్క

సాక్షి, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గతనెల 24న కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ శివారులో దళిత మహిళ సమతపై అత్యాచారం, హత్య చేసిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులతోకలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు.
ప్రతిరోజు సచివాలయానికి వచ్చి ప్రజా పరిపాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విచ్ఛలవిడిగా మద్యం అమ్మకాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎల్లాపటార్‌లో దళిత మహిళపై అత్యాచార, హత్య ఘటనపై గవర్నర్ దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. మహిళలపై దాడులు అరికట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహిళలపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భద్రతపై మహిళలకు ప్రభుత్వం ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు కేవలం టీఆర్‌ఎస్ నాయకులకే పని చేస్తున్నారని విమర్శించారు. వారి వెంట మాజీ ఎంపీలు నిఖిల్, రాథోడ్ రమేశ్ తదితరులు ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి