అమరావతిలో మెట్రో మాట ఉత్తదే

 No Metro Train For Amaravati, Centre Clarifies - Sakshi

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

టీడీపీ డ్రామాలు బట్టబయలు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో మెట్రో రైలు, లైట్‌ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతిలో మెట్రో స్థానంలో లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్నివిజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌(డిఎంఆర్‌సీ) డీపీఆర్‌ సమర్పించక ముందే కన్సల్టెన్సీ చార్జీల పేరుతో రూ. 60 కోట్లు చెల్లించాలని ఎందుకు అడుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్న నేపథ్యంలో అసలు అమరావతిలో మెట్రో ఏర్పాటు జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు.

అసలు మెట్రో రైలు, లైట్‌ మెట్రో రైలుకు సంబంధించి ప్రతిపాదనలే లేవని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీ ఆడుతున్న డ్రామా బయటపడింది. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు మెట్రో పేరుతో పైకి మాటలు చెబుతూ ఏవిధంగా ప్రజలను మోసం చేస్తుందో స్పష్టం అవుతోంది. టీడీపీ నేతలు మెట్రో రైలు రాలేదంటూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసలు ప్రతిపాదనలే లేనప్పుడు కేంద్రం ఎలా మంజూరు చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘మాతృ వందనం’లో వెనుకబడ్డ ఏపీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి మాతృ వందనం పథకం(పీఎంవీవై) అమలు అతంత మాత్రంగానే ఉన్నట్టు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి  వీరేంద్ర కుమార్‌ వెల్లడించిన వివరాల ద్వారా తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్ని రాష్ట్రాల్లో పీఎంవీవై పథకం అమలు తీరు ఎలా ఉందని అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా వాటికి సంబంధించిన గణంకాలను ఆయన వెల్లడించారు. గర్భిణిలు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ. 5 వేలు అందజేస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 50,831 మంది గర్భిణిలు, బాలింతలైన తల్లులు లబ్ది పొందగా, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2,352 మంది మాత్రమే లబ్ది పొందారు. ఈ పథకం అమలులో జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘఢ్‌ల కన్నా ఏపీ వెనుకబడి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top