
కటిహార్/న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్ సంచలన ప్రకటన చేశారు. రాఫెల్ ఒప్పందంపై ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని మోదీకి మద్దతు తెలిపినందుకు నిరసనగా ఆ పార్టీకి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కటిహార్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విషయంలో పవార్ వెలిబుచ్చిన అభిప్రాయం తనకు బాధ కలిగించిందన్నారు. అందుకే పార్లమెంట్ సభ్యత్వం, పార్టీ వ్యవస్థాపక సభ్యత్వంతోపాటు అన్ని పదవుల నుంచి వైదొలిగినట్లు స్పష్టం చేశారు. మద్దతు దారులతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తానన్నారు.