మోదీని దేశమే గేలి చేస్తోంది

Narendra Modi Thinks He Can Run The Country Alone - Sakshi

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

బర్గారీ(ఫరీద్‌కోట్‌): ‘ప్రధాని మోదీ కొన్నేళ్ల కిందట వరకు మన్మోహన్‌ను అనేక మాటలు అంటూ ఎగతాళి చేసేవారు. అయితే ఐదేళ్ల తర్వాత పరిస్థితులు మారాయి. మన్మోహన్‌పై మోదీ ప్రస్తుతం ఎలాంటి వెటకారపు వ్యాఖ్యానాలు చేయడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దేశం మొత్తమే మోదీని ఎగతాళి చేస్తోంది’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ మోదీపై విమర్శలు చేశారు. లోక్‌సభ చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పంజాబ్‌లో పర్యటించిన రాహుల్‌ గాంధీ.. భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. దేశంలోని నిరుద్యోగ యువత కోసం రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని, దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానన్న హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు. మోదీ తీసుకున్న రెండు తప్పుడు నిర్ణయాల(పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ) వల్ల దేశ ఆర్థిక పరిస్థితి నాశనమైందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో మన్మోహన్‌ సింగ్‌ సలహాను మోదీ తీసుకుని ఉంటే ఈ రెండు తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు కాదని అన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ సారథిగా ఉన్న యూపీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ సారథిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి మధ్య తేడాలను ఈ సందర్భంగా రాహుల్‌ ఎత్తి చూపారు. మోదీ తాను ఒక్కడినే దేశాన్ని నడపగలను అనుకుంటున్నారని, వాస్తవానికి ప్రజలు ఈ దేశాన్ని నడుపుతున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. సిక్కుల పవిత్ర గ్రంధం గురు గ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేసిన 2015 నాటి కేసులకు సంబంధించిన దోషులను వదిలిపెట్టేది లేదని రాహుల్‌ స్పష్టం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top