
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర కాపు నాయకుడు పోకల అశోక్‌కుమార్ తదితరులు
కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): చంద్రబాబు ధనికులకే వత్తాసు పలుకుతారని, వైఎస్ జగన్ పేదల సీఎం అని ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. కార్వేటినగరం మండల కార్యాలయంలో మండల కాపు నాయకుడు లతాబాలాజీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కాపు నేస్తం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాపు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు వారికి చేసింది శూన్యమన్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి సామాజికవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాపు నేస్తం పథకం అమలు చేసి అర్హులైన ప్రతి కాపు కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర కాపు నాయకుడు పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ కాపులకు ఇచ్చిన మాట ప్రకారం కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి కాపు కుటుంబం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరించాలన్నారు. ఈ సందర్భంగా కాపు నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.