రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్రం

Muslim Personal Law Board pleanery - Sakshi

దీనిపై ముస్లింలంతా ఐక్య పోరు సాగించాలి

ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్లీనరీలో అధ్యక్షుడు నద్వీ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు జాతీయ అధ్యక్షుడు మౌలానా రాబె హసనీ నద్వీ విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాలు సంఘటితమై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని సాలారే మిల్లత్‌ ఆడిటోరియంలో జరుగుతున్న ముస్లిం పర్సనల్‌ లా ప్లీనరీ సమావేశాల్లో శనివారం బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా నద్వీ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ముస్లింల ధార్మిక, షరియత్‌ హక్కులను మార్చడానికి కేంద్రం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నాలను ముస్లిం సముదాయం తిప్పికొట్టాలన్నారు. కేంద్ర వైఖరిపై ముస్లిం సమాజం, ముస్లిం సంస్థలు, బోర్డులు మౌనం పాటించడం సరికాదన్నారు.

కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలు చేయడం అందరి బాధ్యత అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాబ్రీ మసీదు శతాబ్దాలుగా ముస్లింల మసీదుగానే ఉందని, ప్రభుత్వాలు దీన్ని మార్చడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించడం సరికాదన్నారు.

పెరుగుతోన్న మతతత్వం
బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రహ్మెనీ మాట్లాడుతూ.. దేశంలో రోజు రోజుకూ మతతత్వం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వ్యతిరేకంగా 4.40 కోట్ల దరఖాస్తులను కమిషన్‌కు అందించామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సూచనలపై సమీక్షించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

ఈ బిల్లు వల్ల కలిగే నష్టం గురించి రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి కూడా తెలిపామన్నారు. కార్యక్రమంలో బోర్డు ఉపాధ్యక్షుడు మౌలానా సయిద్‌ ఉమ్రీ, కార్యదర్శులు మౌలానా ఖాలిద్‌ సైఫుల్లా రహ్మెనీ, మౌలానా సయ్యద్‌ ఆర్షద్‌ మదనీ, ప్లీనరీ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top