హుదూద్‌ కన్నా తీవ్రమైనది

Muppalla Nageshwar Rao Slams Both Cetral And State Goverments Over Titli Cyclone - Sakshi

శ్రీకాకుళం: జిల్లాలోని 18 మండలాల్లో తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ ఏజెంట్ల, బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విలేకరులతో ముప్పాళ్ల మాట్లాడుతూ..గతంలో వచ్చిన హుదూద్‌ తుపాను కన్నా తిత్లీ తుపాను తీవ్రమైన తుపానుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తుపాను బాధిత ప్రాంతంపై కన్నెత్తి కూడా చూడకపోవడం చాలా హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. బాధితులకు పూర్తిగా సహాయకచర్యలు చేయకుండానే తెలుగు దేశం ప్రభుత్వం అందరినీ ఆదుకున్నామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పుబట్టారు.

తుపాను బాధితుల ప్రాంతాల్లో ఉపాధి హామీ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే రూ.300 వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవచ్చవాలులా ఉన్న తుపాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. పదేళ్ల ప్యాకేజీని ప్రభుత్వం వారం రోజుల్లోనే ప్రకటించాలని కోరారు. సత్వరమే తుపాను బాధితులను ఆదుకోవాలని, అవసరమైతే అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలకు ఏ విషయంపైన ఐనా దీక్షలు చేసే అధికారం ఉంటుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అగ్రిగోల్డ్‌ బాధితులకు  న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top