కేసీఆర్‌పై మండిపడ్డ మందకృష్ణ

MRPS Chief Mandha Krishna Madiga Slams KCR In Somajiguda - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం మాదిగలను చిన్న చూపు చూస్తున్నదని ఆరోపించారు.  ఎస్సీ వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు ఎవరు వచ్చినా మా నిరసన తెలియజేస్తామని వెల్లడించారు. కేసీఆర్‌ నిండు సభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్త భారతి మాదిగ, హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ముందు చనిపోయి 10 నెలలు అయింది.. ఇప్పటి వరకు ఆమె కుటుంబానికి ఇస్తానన్న రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా మాట్లాడుతూ..‘ కేసీఆర్‌ అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతా అన్నారు. 10 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ ఊసే లేదు. కేసీఆర్‌ మాటాల మనిషి..చేతల మనిషి కాదు. సామాజిక వర్గాల కోణంలో కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్‌ చేయాలి. మాదిగలు చేసే కులవృత్తుల్లో లెదర్‌ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏంచేయలేదు. చెప్పులు కుట్టే కార్మికులకు పింఛన్‌ ఇచ్చారా? డప్పులు కొట్టే కార్మికులకు పింఛన్‌ ఇచ్చారా? కేసీఆర్‌ ప్రభుత్వంలో అవమానకరంగా భర్తరఫ్‌ చేసింది ఒక్క మాదిగ సామాజికవర్గానికి చెందిన రాజయ్యనే. రామగుండం మేయర్‌ మాదిగ కాబట్టే కావాలని అతడిపై అవిశ్వాసం పెట్టారు. మాదిగ సామాజిక వర్గానికి స్థలం లేదు..భవనం లేదు. మాదిగ వర్గంపై వివక్ష చూపెడుతున్నా’రని విమర్శించారు.

‘దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ?. మంత్రివర్గంలో మాదిగలకు నిజమైన ప్రాతినిథ్యం లేదు. టీఆర్‌ఎస్‌లో ఉన్న 16 మంది దళిత ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. దళితులకు ఒక శాతం కూడా భూపంపిణీ జరగలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారా?  టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకు విలువ లేదు. కేసీఆర్‌ ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేకుండా చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు పోరాడారు. వారిని ప్రభుత్వం గుర్తించడం లేదు. తెలంగాణ మహిళలకు అవమానం మిగిలింది..గౌరవం దక్కలేద’ని టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు.

నవంబర్‌ 6న ప్రజాగ్రహ సభ ఉంటుందని, టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మంద కృష్ణ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top