చంద్రబాబు లాంటి నీచుడిని నమ్మొద్దన్నారు

Motkupalli Narasimhulu Once Again Hits CM Chandrababu - Sakshi

చంద్రబాబు మోసాలు, కుట్ర,  వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. చంద్రబాబును నమ్మొద్దని ఎన్టీఆర్‌ ఆనాడే హెచ్చరించినా వినకుండా నమ్మి మోసపోయానన్నారు.

తిరుపతి తుడా/తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలు, కుట్ర,  వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తాను పేద దళితుడినని, అంబేడ్కర్‌ వారసుడినని, ఎన్టీఆర్‌ శిష్యుడినని చెప్పారు. చంద్రబాబులాంటి నీచుడిని నమ్మొద్దని ఎన్టీఆర్‌ ఆనాడే హెచ్చరించినా వినకుండా నమ్మి నిండా మోసపోయానని ఆక్రోశించారు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి హత్య చేశాడని, కేసీఆర్‌ను రాజకీయంగా చంపాలని ప్లాన్‌ చేశాడని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు రాజకీయ వారసులు 30  ఉండగా నన్ను తప్ప మిగిలిన అందర్నీ అదే తరహాలో చంపేశాడని చెప్పారు.

కుర్చీ కోసం వెన్నుపోటు: చంద్రబాబు అధర్మాలపై ధర్మపోరాటం పేరుతో బుధవారం మోత్కుపల్లి అలిపిరి మీదుగా కాలినడకన తిరుమలకు బయల్దేరారు. అంతకుముందు అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావ్‌పూలే, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయనకు వైఎస్సార్‌ సీపీ, జనసేన, దళిత సంఘాల నేతలు ఘన స్వాగతం పలికాయి. అనంతరం అలిపిరి సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పిల్లనిచ్చి పంచన చేర్చుకున్న మామకు వెన్నుపోటు పొడిచి మానసికంగా హత్య చేశారని ధ్వజమెత్తారు. 

టీడీపీలో దళితులంతా దగా పడ్డారు: చంద్రబాబు కుల రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారు. టీడీపీలో దళితులంతా దగా పడ్డారు. పార్టీలో కష్టపడ్డ ఏ ఒక్క దళితుడికైనా న్యాయం చేశారా? కేంద్ర మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యులుగా దళితులు పనికిరారా? రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బులు చాలవన్నట్టు ఒక్కో రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంటేష్‌లకు ఏ అర్హత ఉందని ఎంపీ పదవులు ఇచ్చారు?  చంద్రబాబును చిత్తుగా ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకం కావాలి.’ అని మోత్కుపల్లి పేర్కొన్నారు.

అస్వస్థతకు గురైన మోత్కుపల్లి: శ్రీవారిని దర్శించుకోవడానికి బుధవారం కాలినడక మార్గంలో బయలుదేరిన మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. గాలిగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఆయనకు బీపీ తగ్గింది. దీంతో అక్కడ ఉన్న టీటీడీ ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. వాహనంలో వెళ్లాలని సిబ్బంది సూచించినా నడుచుకుంటూనే తిరుమల చేరుకున్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురికాగా తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేర్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top