పార్టీ కోసం పనిచేసి షుగర్‌ ఎక్కువైంది

Mothkupally Narsimhulu Slams Nara Chandra Babu Naidu In Hyderabad - Sakshi

హైదరాబాద్‌ : మన పార్టీ(టీడీపీ) తెలంగాణలో పూర్తిగా నాశనమైందని, ఇప్పుడు స్మశానంలా ఉందని, మళ్లీ మొక్క పెట్టి నీళ్లు పోయాలని  టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పిలిస్తే వస్తాను కానీ మీరు నన్ను పొమ్మంటున్నారని, పార్టీ కోసం పని చేసి ఒంట్లో షుగర్ కూడా ఎక్కువైందని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ..‘ నేను ఏ తప్పుచేశానో నాకు తెలియదు. ఫలానా తప్పు చేశానని మా నాయకుడు చెబితే సంతోషిస్తా. నేను ఏం ఆల్తు ఫాల్తు గాన్ని కాదు. డబ్బులు లేకున్నా ఎన్టీఆర్ ఆశీస్సులు ఆలేరు ప్రజల ఓట్లతో గెలిచా. నేను ఏం తప్పుచేశానో చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఈ తప్పుచేశానని చెబితే ముక్కు నేలకు రాస్తా. నన్ను మీటింగ్లకు పిలవరా, టెలీకాన్ఫరెన్స్‌లో నాకు లైన్ ఎందుకు ఇవ్వరు. ఎన్టీఆర్, పార్టీ స్థాపించిన మూల సిద్ధాంతాలతో పార్టీ నడవాలా వద్దా. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుల వల్ల పార్టీ తెలంగాణలో నాశనమైంది.  రమణను సైలెంట్ చేసి సీఎంగా నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్‌ను ఫోకస్ చేశారు. మీ పేరు బొమ్మ లేకుండా ప్రోగ్రాం చేసినా చర్యలు ఎందుకు తీసుకోలే. ఓటుకు కోట్లులో రెడ్ హ్యాండెడ్‌గా మనం తయారు చేసిన నాయకుడు దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదని’  చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

‘ చంద్రబాబు చెబితేనే టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌లో చేరా అంటున్నాడంట. రేవంత్ రెడ్డి పై మీకేందుకు అంత ప్రేమ, రేవంత్‌ను వ్యతిరేకిస్తే నన్ను దూరం పెడతావా. రేవంత్ బిడ్డ పెళ్లిలో ఎంగేజ్‌మెంట్‌కు కేబినెట్‌తో సహా వెళతావు. పెళ్లికి వెళుతావు, పెళ్లి ఖర్చంతా భరిస్తావు. నా బిడ్డ పెళ్లికి పిల్వంగ పిల్వంగ ఎప్పుడో సాయంత్రం వచ్చావు. నీకన్నా కేసీఆరే నయం. పెళ్లికి ముందే వచ్చాడు. పెద్ద మాదిగ అన్నావు. నిజామాబాద్లో మీ పాదయాత్ర ముందుండి నడిపించిన ఇద్దరు మాదిగ పిల్లలు ప్రమాదంలో చచ్చిపోతే పట్టించుకున్నావా. పేదోడంటే ఎందుకంత చులకన నీకు. పెద్ద మాదిగ అన్న నీవు ఎస్సీ వర్గీకరణ ఏం చేశావు. మాట్లాడితే రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారుతా అని బెదిరిస్తున్నాడని భయపడుతున్నారంట. నిన్న మహానాడు చూస్తే నవ్వొచ్చింది. పక్కన ఎవ్వరు లేక ఆయనే జై కొట్టుకున్నాడ’ ని మోత్కుపల్లి చెప్పారు.

‘ నన్నే గౌరవించనప్పుడు అంబేద్కర్ పెద్ద విగ్రహం పెడితే ఎంత. పెట్టకపోతే ఎంత. పేదోనికి, తిండికి గతిలేని వానికి కూడా కేసీఆర్ రాజ్యసభ అవకాశం ఇచ్చాడు. పవన్ కళ్యాన్‌పై ఇక్కడ నుంచి స్పందించా. అక్కడ ఎవరు స్పందించలే. కేసీఆర్ మన వాడు. ఆ కేబినెట్లో ఉన్న వాళ్లంతా మన వాళ్లు. టీఆర్ఎస్‌తో యుద్దం ఏంది. అవసరమైతే కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటే మంచిది. నాకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే, హోదా ఉద్యమం నడుస్తుందని ఆపింది మీరు కాదా. నన్నుకాదని గరికపాటికి రాజ్యసభ ఇవ్వలేదా. టీజీ వెంకటేష్‌కు ఎలా రాజ్యసభ ఇస్తారు. అతను పార్టీకి ఏం సేవ చేశారు. కనీసం ఎన్టీఆర్ ఘాట్‌కైనా వర్ధంతి నాడు వస్తారనుకున్నా రాలేద’  ని తెలిపారు.

‘డబ్బులు లేకున్నా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.  నేను ఏ నేరం చేయనున్న పార్టీ నుండి బయటకు పంపాలని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక పార్టీ మనగడే తెలంగాణలో కష్టం అయినా నేను పార్టీని వీడలేదు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు పార్టీని బలిచేశారు. ఆయన వల్లనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది.  సీఎం పదవి ఇస్తాం అని క్రిష్ణయ్యకు చెప్పారు. మేము ఏం అనలేదు కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఏ విధంగా ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పారు. ఓటుకు నోటు కేసులో మధ్యాహ్నం దొంగగా దొరికాడు. ఎందుకు మీరు ఆయనను సస్పెండ్ చెయ్యలేదు. రాహుల్ గాంధీని కల్సి కాంగ్రెస్లో చేరుతున్నాను అని కేసీఆర్‌ను ఒడిస్తాను అని చెప్పినప్పుడు కూడా ఎందుకు స్పందించలేదు. 15 సంవత్సరాల దోస్తాన చేసిన కేసీఆర్ ఇట్లా బిడ్డ పెళ్లి ఉంది అని చెప్పగానే ఆత్మీయంగా స్వాగతం పాలకడమే కాదు పెళ్లి కూడా వచ్చారు. అయ్యా చంద్రబాబు గారు ఆంధ్రాలో కూడా దళితులు ఉన్నారు జాగ్రత్త. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. కనీసం మీరు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ఛాయా కోసం కూడా నాకు సమయం ఇవ్వలేదు. మీరా దళితులకు న్యాయం చేసేది. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు బడుగు బలహీన వర్గాలకు చేసిన న్యాయం ఇదేనా’   అని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top