టీడీపీలో వసూల్‌ రాజాలు | Money Collecting For Lokesh Tour In West Godavari | Sakshi
Sakshi News home page

టీడీపీలో వసూల్‌ రాజాలు

Jul 16 2018 6:40 AM | Updated on Jul 16 2018 6:40 AM

Money Collecting For Lokesh Tour In West Godavari - Sakshi

ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వర్షంలో వచ్చిన పెరవలి మండల అధికారులు

నిడదవోలు రూరల్‌: ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెడితే చాలు జన్మభూమి కమిటీ సభ్యుల జేబులు నిండుతున్నాయి. నిరుపేదలు, అర్హులను ఆయా పథకాలకు ఎంపిక చేయాలంటే అధికార పార్టీ నేతలు ఒక రేటు నిర్ణయించి దోచుకుతింటున్నారు. జిల్లాలో జన్మభూమి కమిటీ సభ్యుల అరాచకాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి కావడంతో టీడీపీలో వసూల్‌ రాజాలు దందా కొనసాగిస్తున్నారు. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగితే తప్ప తమకు ఏ పని జరగడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఈనెల 17న మంత్రి నారా లోకేష్‌ పర్యటన ఉండటంతో పాటు ఆదివారం ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పుట్టినరోజు కావడంతో నిడదవోలు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ నేతలతో పాటు, జన్మభూమి కమిటీ సభ్యులు ఇటీవల పలు కార్పొరేషన్‌ రుణాలు, పలు పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు, రాయితీ రుణాలు తీసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారీగా వసూళ్లు..
నిడదవోలు నియోజకవర్గంలో సుమారు రూ.800 కోట్లతో అభివృద్ధి చేశామని అధికారపార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే గ్రామస్థాయిలో ఆయా పథకాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అభివృద్ధి పథకాల మాటున అవినీతి దందా సాగుతోంది. గోదావరి తీరంలో ఉన్న పందలపర్రు, కానూరు– పెండ్యాల, మరికొన్ని అక్రమ ఇసుక ర్యాంపుల వద్ద అనధికారికంగా ఇసుకను విక్రయించడంతో పాటు యంత్రాలతో ఇసుక లోడింగ్‌ చేయించి అక్రమార్కులు రూ.కోట్లు కొల్లగొట్టారు. దీంతో ర్యాంపు నిర్వాహకులు అధికారపార్టీ నేతలకు రోజువారీగా మామూళ్లు అందజేసేవారు. ఇటీవల నిడదవోలు మండలంలో స్వయం ఉపాధి సోపాన రుణాలకు దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు రుణాలు మంజూరులో ఎస్సీల నుంచి రూ.5 వేలు, కాపుల నుంచి రూ.3 వేల వరకు జన్మభూమి కమిటీ సభ్యులు వసూళ్లకు పాల్పడ్డారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి నుంచి కూడా అడ్వాన్స్‌ రూపంలో కొంత మొత్తంలో నగదును లబ్ధిదారులు జన్మభూమి కమిటీ సభ్యులకు ముట్టజెప్పారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శేషారావు పుట్టిన రోజును ఈ ఏడాది ఘనంగా నిర్వహించడంతో పాటు మంత్రి లోకేష్‌ మండలంలోని కంసాలిపాలెం–శింగవరం రోడ్డు, తాడిమళ్ల డ్వాక్రా భవనం, కమ్యూనిటీ భవనాలను ప్రారంభిస్తారని దీంతో ప్లెక్సీలతో పాటు ఇతర ఖర్చులు ఉంటాయని చెబుతూ టీడీపీ నేతలు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వర్షంలో అధికారులకు తప్పని ఇబ్బందులు
నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు పుట్టిన రోజు ఆదివారం కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు మండల, గ్రామస్థాయి అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు సెలవు రోజు కావడంతో తప్పని పరిస్థితిలో ఎమ్మెల్యే స్వగ్రామం వేలివెన్ను వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వెళ్లకపోతే టీడీపీ నేతల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందనే భయంతో వర్షంలోనే వెళ్లామని అధికారులు వాపోతున్నారు. జూన్‌ 24న రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ పుట్టినరోజు కూడా పందలపర్రులో నిర్వహించడంతో ఆదివారం అయినా తప్పలేదని, వారానికి ఒక్కసారి వచ్చే సెలవు కూడా టీడీపీ నేతల చుట్టూ తిరగడానికి సరిపోతోందని వార ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వసూళ్ల రాజాలపై దృష్టిపెట్టి అర్హులకు పథకాలు అందేలా కృషిచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement