అధికారముందని విర్రవీగొద్దు!

minister somireddy meeting with tdp leaders - Sakshi

అచితూచి వ్యవహరించండి!

సౌమ్యంగా పనులు చేసుకోండి

రానున్నది ఎన్నికల వేళ..

ప్రతిపక్షం చురుగ్గా ఉంది

ప్రజావ్యతిరేకత వస్తే నష్టం మనకే

జిల్లా టీడీపీ నేతలకు ఇన్‌చార్జి మంత్రి హితవు

సాక్షి ప్రతినిధి, కడప : టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో అధికారం ముసుగులో ఇంతకాలం చేసిన అవినీతి, అక్రమాలకు ఇక అడ్డుకట్ట వేయకపోతే కష్టమనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులపై బెదిరింపు ధోరణికి స్వస్తి చెప్పి, సౌమ్యంతో పనులు చేయించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల జిల్లా ముఖ్యనేతలతో రాజధానిలో పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఘావర్గాల ద్వారా తాను తెప్పించుకున్న సమాచారాన్ని క్రోడికరించుకుని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. నేతల మధ్య కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు తీవ్రతరం కావడంతో అధినేత దిద్దుబాటు చర్యలకు దిగారు. అందులోభాగంగానే జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి రెండురోజుల జిల్లా పర్యటనలో పార్టీ ముఖ్యనేతలతో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎల్లకాలం సాగదు..
పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా రెండురోజులపాటు కడపలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమ మాటకు విలువలేకుండా పోయిందని, జూనియర్లదే హవా నడుస్తోందని, ఇలాగైతే జిల్లాలో పార్టీ మనుగడ సాగించేలేదని ఆది నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న కొందరు సీనియర్‌ నాయకులు కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా అధికార ముసుగులో నేతలు కొందరు భారీ అవినీతికి పాల్పడిన ఉదంతాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అధికారముందని, మనమనుకున్నవన్నీ జరిగిపోతాయనుకోవడం పొరపాటే అవుతుందని, ఎల్లకాలం మన ఆటలు సాగవన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లేదంటే పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే మరోవైపు తమ పనులేమీ జరగడం లేదని, అధికారులు తమ మాటే వినడం లేదని కొందరు నేతలు మంత్రి వద్ద వాపోయారు. తక్షణమే ఆ అధికారులకు స్థానచలనం కలిగించాలని ఒత్తిడి కూడా తెచ్చారు.

పార్టీకి మచ్చతెచ్చే పనులు చేపట్టొద్దు
‘రానున్నది ఎన్నికల వేళ.. పార్టీ నేతలు, నాయకులు అందరూ ప్రజలతో కలిసి పోయి పనిచేయాలి. ఇది పార్టీ ఆదేశమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా వ్యవతిరేకతను మూటకట్టుకోకూడదు’ అని ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి జిల్లా నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షం చురుకైన పాత్రను పోషిస్తూ అధికారపార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పుడు మిత్రపక్షమైన బీజేపీ కూడా మనపై దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీనేతలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలో అధికారపార్టీ నేతల అవినీతి, అక్రమాలు పెరిగాయని, అధినేత వద్ద స్పష్టమైన సమాచారం ఉందని, ఇకపై వాటికి స్వస్తి పలకాలని హెచ్చరించడం కొందరు నేతలకు రుచించడం లేదని తెలుస్తోంది.

మంచి పనులు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలికానీ, అవినీతి పనులు, కబ్జాలతో పత్రికల్లో పతాకశీర్షికల్లో నిలవరాదని ఇన్‌చార్జి మంత్రి హితవుపలికారు. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తుంటారని, వారిని తక్కువ అంచనా వేయరాదని హెచ్చరించారు. ‘ప్రతిదానికి తగువపడితే నష్టం మనకే జరుగుతుంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా టీడీపీకి పేరుంది. దానికి మచ్చ తెచ్చే పనులేవీ చేపట్టొద్దు. చీటికిమాటికి అధికారులపై చిర్రుబుర్రలాడొద్దు. వారితో సౌమ్యంగా పనులు చేపించుకోండి. బెదిరిస్తే అన్ని పనులూ జరగవు.’ అని మంత్రి సోమిరెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. జిల్లాలో బలహీనంగా ఉన్న ఆ పార్టీ, అధినేత చర్యలతో ఎంతమేరకు పుంజుకుంటుందో వేచిచూడాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top