బాబు వైఫల్యంతోనే అభివృద్ధి తిరోగమనం

Minister Sankaranarayana Comments On Nara Chandrababu Naidu - Sakshi

టీడీపీ ఐదేళ్ల పాలన మోసపూరితం

జగనన్న పాలనపై అందరికీ నమ్మకమేర్పడింది 

మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ 

దిగజారుడు రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదని, ఆయన వైఫల్యంతోనే అభివృద్ధి తిరోగమన దిశగా పయనించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు.

సాక్షి, పరిగి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యంతో రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనంలో పడిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. శనివారం హొన్నంపల్లిలో బహిరంగ సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నిర్వాకంతోనే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడానికి ఒప్పుకోలేదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో 5 ఏళ్లుగా భ్రమరావతిని సృష్టించి నిధులన్నీ వెనక్కి వెళ్లేందుకు కారణమయ్యాడని మండిపడ్డారు. ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్న భూముల్లో కంపచెట్లను కూడా తొలగించలేదని విమర్శించారు.  

విసుగు తెప్పిస్తున్న చంద్రబాబు విమర్శలు 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవక ముందే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. జగనన్న పాలనపై చంద్రబాబు విమర్శలు ప్రజలకు విసుగుతెప్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఆయన బీసీ సంక్షేమ శాఖలోనే దాదాపు రూ.1432 కోట్ల అప్పులు చేశారన్నారు. కనీసం స్కాలర్‌షిప్‌లు, కాస్మొటిక్‌ బిల్లులు కూడా ఇవ్వని టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఏ మోహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. గడిచిన ఐదేళ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేని టీడీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైందన్నారు.

ఖాళీ ఖజానాను మిగిల్చిపోయిందని టీడీపీ, మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించడమే కాకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలుజరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ జయరాం, మంత్రి సోదరుడు మాలగుండ్ల రవీంద్ర, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి డీవి రమణ, మాజీ సర్పంచ్‌ గోవిందరెడ్డి, పెనుకొండ మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మారుతీరెడ్డి, మారుతీశ్వరావు తదితరులు 
పాల్గొన్నారు.   

కియా భూముల చదును పేరుతో ప్రజాధనం వృథా 
పెనుకొండలో కియా పరిశ్రమ ఏర్పాటు సమయంలో కేవలం చదును చేయడానికి రూ.177 కోట్ల ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృథా చేయడమే కాకుండా అక్రమాలకు పాల్పడి రైతులకు మోసం చేశారని మంత్రి విరుచుకుపడ్డారు.  చంద్రబాబు 1995లో సొంత మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి,  1999లో వాజ్‌పేయి, 2014లో  నరేంద్రమోదీ పేర్లు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యారని, ఏనాడు సొంతంగా అధికారం చేపట్టలేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా విదేశాల పేరుతో కోట్ల డబ్బుని వృథా చేయడమే కాకుండా దర్శకుడు రాజమౌళితో రాజధాని కట్టించాలని పుణ్యకాలమంతా గడిపేశారని ఆరోపించారు. ఇలాంటి అబద్ధపు పాలనతోనే వరల్డ్‌ బ్యాంకు రుణం ఇవ్వకుండా వెనకడుగు వేసిందన్నారు. ప్రజలను అన్నింటా ఇలా మోసం చేసి అప్పులను మోపిన ఘనత బాబుకే దక్కిందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top