సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎంఐఎం దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలోనూ పలు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. టీఆర్‌ఎస్‌కు సంఖ్యబలం ఉండటంతో ఈ మూడు స్థానాలూ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 12 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు గడువు 15 వరకు ఉంది. 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
