రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర

Mekapati Families Political Journey In Udayagiri - Sakshi

సాక్షి, ఉదయగిరి: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి సోదరులకు ప్రత్యేక స్థానం ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జాతీయస్థాయిలో రాజకీయాల్లో తమదైన ముద్రవేసుకున్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ముగ్గురూ ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలిలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 

రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1983లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన అదే ఏడాది కాంగ్రెస్‌ తరపున ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. 1985లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1989లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో నర్సరావుపేట ఎంపీగా పనిచేశారు. 2009, 2012, 2014లో నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. 2004లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో ప్రముఖ స్థానం వహించారు. 2006లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉదయగిరి నుంచే ప్రారంభించారు.

పెద్దిరెడ్డిపల్లి, సీతారాంసాగర్‌ రిజర్వాయర్లు సాధించి వైఎస్సార్‌ చేతులమీదుగా శంకుస్థాపన చేయించారు. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరి ఆయన పక్షాన నిలిచారు. జిల్లాలో అనేక రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొని జగన్‌తోనే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ నిర్ణయం మేరకు రెండుసార్లు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ తరపున పార్లమెంటులో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్సార్‌సీపీలో రాష్ట్రస్థాయి కీలకనేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కమిటీలో కూడా ఆయన సభ్యుడుగా ఉన్నారు. 

సోదరుడు.. తనయుడు
మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా జిల్లా, ఉదయగిరి నియోజకవర్గాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు రికార్డుస్థాయిలో మెజారిటీ తీర్పు ఇచ్చారు. అలాగే ఉదయగిరి నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డి కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మొత్తమ్మీద మేకపాటి కుటుంబం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కీలకంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top