
మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ-కాంగ్రెస్ పొత్తుకు బ్రేక్
సాక్షి, భోపాల్ : బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు సమిష్టిగా పోరాడాలన్న ప్రతిపాదనకు విఘాతం కలిగింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ నిర్ణయించడంతో కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేక్ పడింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి ఆ పార్టీతో సంప్రదింపులు జరపడం లేదని ఓ బీఎస్‌పీ సీనియర్ నేత స్పష్టం చేశారు. రాష్ట్ర స్ధాయిలో కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పొత్తుపై ఎలాంటి చర్చలు జరగడం లేదని, కేంద్ర స్ధాయిలోనూ పొత్తులపై ఎలాంటి సంప్రదింపులూ లేవని ఎంపీ బీఎస్పీ చీఫ్ నర్మదా ప్రసాద్, అహిర్వార్ చెప్పారు.
కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు పట్టున్న గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల్లో విభేదాలు పొడసూపినట్టు సమాచారం. ఈ ప్రాంతంలో బీఎస్పీకి ప్రాబల్యం ఉండటంతో ఇరు పార్టీలూ అత్యధిక సీట్లు కోరుతుండటంతో పొత్తుకు అవరోధాలు నెలకొన్నట్టు తెలిసింది.
మరోవైపు బీఎస్పీతో పొత్తు చర్చలపై కాంగ్రెస్ సైతం ఆచితూచి స్పందించింది. తాము బీఎస్పీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని, భావసారూప్య పార్టీలతో కలిసి బీజేపీని ఎదుర్కొంటామని మాత్రమే చెబుతున్నామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ మనక్ అగర్వాల్ చెప్పారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో జరగనున్న విషయం తెలిసిందే.