గంజాయి గురజాలగా మార్చేస్తున్నారు

Marijuana smugling in gurajala :kasu mahesh reddy - Sakshi

వైఎస్సార్‌ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం

పట్నంబజారు(గుంటూరు): చారిత్రక ప్రాధాన్యం కలిగిన పల్నాడు ప్రాంతం.. సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న జిల్లా.. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో.. గురజాలను గంజాయి మయంగా మార్చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట, గనులు, మద్యం అమ్మకాలు, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల వరకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు సంబంధం లేదా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం తీసివేసిన జీవీఆర్‌ క్లబ్‌ నిర్వాహకులు.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలను వదిలేసి మారుమూల గ్రామంలో క్లబ్‌ పెట్టేందుకు ఎమ్మెల్యే యరపతినేని సహకరించారనేది వాస్తవం కాదా అని నిలదీశారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రూ.కోటి విలువ చేసే గంజాయిని క్యాపిటల్‌ కల్చరల్‌ క్లబ్‌కు తీసుకెళ్తున్నట్లు ఆ వాహన డ్రైవర్‌ పోలీసుల వద్ద ఒప్పుకొన్న విషయం విదితమేనన్నారు. ఎమ్మెల్యే అండదండలు ఉండటంతోనే ఆగడాలు అధికమైపోతున్నాయని ధ్వజమెత్తారు.

బెల్టుషాపులతో యువత, విద్యార్థులు పెడదోవ పడుతున్నారని, కొత్తగా గంజాయితో వారి జీవితాలను నాశనం చేసే చర్యలపై తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలను ఆయనకు కావాల్సిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించిన యరపతినేని, ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి అంశానికి సంబంధించి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పేకాటకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాను పేకాట ఖిల్లాగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. పిడుగురాళ్ల సీఐ హనుమంతరావు అధికార పార్టీ పక్షాన ఉద్యోగం చేస్తున్నారన్నారు. ఘర్షణ జరిగితే దెబ్బలు తగిలినా... ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయటం సీఐకి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, కోవూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top